నానికి ప్రజలే బుద్ధి చెబుతారు.. కేశినేని చిన్ని

తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒక వ్యక్తికి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడమే కాకుండా, ఆయన సతీమణికి జడ్పీ చైర్మన్ గా అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరి టీడీపీపైనా, అధినేత చంద్రబాబుపైనా అసత్య ప్రచారాలు చేయడం ఎంత వరకూ సమంజసం అని తెలుగుదేశం నాయకుడు కేశినేని చిన్ని అన్నారు.

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో చంద్రబాబు రా కదలిరా బహిరంగ సభ విజయవంతం అయిన సందర్భంగా నియోజకవర్గ తెలుగుదేశం కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో నియోజకవర్గ తెలుగుదేం ఇన్ చార్జి శావల దేవదత్ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేశినేని చిన్ని పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే  నల్లగట్ల స్వామిదాస్‌ , ఎంపీ కేశినేని నానిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తన సోదరుడు, ఎంపీ నానికి చంద్రబాబు రెండు సార్లు ఎంపీగా అవకాశం ఇస్తే, ఇప్పుడు ఆయన పార్టీకి, అధినేతకూ అండగా ఉండాల్సింది పోయి వైసీపీలో చేరి ప్రగల్భాలు పలకడం విడ్డూరంగా ఉందన్నారు. తెలుగుదేశం పార్టీకి నాయకులు ద్రోహం చేశారే కానీ కార్యకర్తలు కాదని చిన్ని అన్నారు. వైసీపీ టికెట్ కోసం వీరిరువురూ పార్టీని వీడి ఇష్టారీతిగా చంద్రబాబుపై విమర్శలు చేయడం దిగజారుడుతనమని దుయ్యబట్టారు. తనకు నాయకుడిగా కంటే కార్యకర్తగా తెలుగుదేశంలో ఉండటమే ఇష్టమని కేశినేని చిన్ని అన్నారు.  పార్టీ అధినేత చంద్రబాబు  ఏ బాధ్యత ఇచ్చినా దానికి కట్టుబడి ఆ బాధ్యతను నెరవేరుస్తానని స్పష్టం చేశారు. 

విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసింది టిడిపి అధినేత చంద్రబాబు నాయుడేననీ, కానీ ఆయన దయతో ఎంపీగా గెలిచిన  నాని విజయవాడకి చంద్రబాబు ద్రోహం చేశాడు అనటం దుర్మార్గమని విమర్శించారు.  చంద్రబాబు నాయుడు విజయవాడ లోక్ సభ నియోజకవర్గంలో ఒక కార్యకర్తని పార్టీ  అభ్యర్థిగా నిలబెట్టినా  లక్షన్నర మెజార్టీతో గెలిపిస్తారని చిన్నిఅన్నారు. చంద్రబాబు దయతో ఎంపీగా గెలిచి ఆయనపైనే విమర్శలు చేస్తున్న కేశినేని నానికి ప్రజలు త్వరలో బుద్ధి చెబుతారని చిన్ని అన్నారు.