జగన్ సభ నుంచి జనం పరుగో పరుగు!
posted on Feb 28, 2023 1:46PM
ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభలన్నా, ప్రసంగాలన్నా జనాలు బెంబేలెత్తిపోతున్నారు. గత నాలుగేళ్లుగా వింటున్న ఆవు కథను ఇంకెంత మాత్రం వినలేమంటూ పారిపోతున్నారు. అదే సమయంలో విపక్ష తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సభలకు, సమావేశాలకు, యాత్రలకు, కార్యక్రమాలకు జనం పోటెత్తుతున్నారు. ప్రతి పాటకూ చప్పట్లతో తమ ఆమోదం తెలుపుతున్నారు.
తాజాగా జగన్ సభ నుంచి జనం పారిపోతుండటం కెమేరాకు చిక్కింది. జనాన్ని రప్పించడానికి పథకాల ఆశ, అలాగే పథకాల కోత భయం పెట్టి తీసుకువచ్చినా.. వచ్చిన వారు వచ్చినట్లే ముఖ్యమంత్రి ప్రసంగం మొదలు కాగానే పోలీసులను తోసుకుని మరీ వెళ్లి పోతున్నారు. గతంలో పలుసార్లు ఇటువంటి దృశ్యాలు కనిపించాయి. అయినా ఇటీవలి కాలంలో జగన్ బటన్ నొక్కడానికి తప్ప మరే కార్యక్రమం కోసం పెద్దగా జనాలలోకి రావడం లేదు. అనివార్యంగా ఏదైనా కార్యక్రమం కోసం రావాల్సి వచ్చినా జనం తనకు కనబడకుండా లేదా.. జనానికి తాను కనబడకుండా పరదాల మాటునే రాకపోకలు సాగిస్తున్నారు. మిగిలిన సమయం అంతా తాడెపల్లి ప్యాలెస్ లోనే గడిపేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా మంగళవారం (ఫిబ్రవరి 28) గుంటూరు జిల్లా తెనాలిలో మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి జగన్ కార్యక్రమానికి తెనాలి, వేమూరు, పొన్నూరు నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో డ్వాక్రా మహిళలను తరలించారు. ఇంతకీ జగన్ ఈ సభ ఏర్పాటు చేసింది రైతు భరోసా పథకంలో భాగంగా బటన్ నొక్కి రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేసే కార్యక్రమం కోసం. బటన్ నొక్కిన తరువాత యథావిధిగా జగన్ తన ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లు పైబడిన పాలనలో ప్రజలకు ఎంతెంత నిధులు బటన్ నొక్కి జమ చేశారు. సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది. ఇత్యాది విషయాలు చెబుతూ పనిలో పనిగా విపక్షంపై విమర్శలు గుప్పించడానికి.సమాయత్తం అయ్యారు.
అయితే బటన్ నొక్కుడు కార్యక్రమం కాగానే సభలో ఏం జరుగుతుందో ముందుగానే తెలిసి ఉండటంతో సభకు వచ్చిన వారు వచ్చినట్లే సీఎం ప్రసంగానికి ముందే లేచి వెళ్లి పోవడం ప్రారంభించారు. వెళ్లే దారిలో పోలీసులు అడ్డంగా నిలుచుని ఆపడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. పోలీసులను తోసుకుని కొందరు, మార్కెట్ యార్డ్ గోడలు దూకి మరి కొందరూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోయారు. దీంతో పోలీసులు కూడా చేసేదేం లేక మిన్నకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్నాయి. జగన్ చూసి జనం పరుగో పరుగు అంటూ కామెంట్లు పెడుతున్నారు. గుర్రాన్ని చెరువు దగ్గరకు తీసుకురాగలరు కానీ, నీళ్లు తాగించలేరు అన్నట్లు జనాన్ని ఏవో ప్రలోభాలు పెట్టి.. లేద పథకాల కోత పేరు చెప్పి బయపెట్టి సభకి అయితే తీసుకురాగలిగారు కానీ.. జగన్ ప్రసంగాన్ని వినేటట్లు మాత్రం చేయలేకపోయారు.