వైసీపీ నేతల తీరు.. చౌకబారు!

ఊరందరిదీ ఒక దారైతే ఉలిపికట్టెది మరో దారి అన్నది సామెత. ఇప్పుడు ఆ సామెతలో ఉలిపికట్టె పేరు తీసేసి వైసీపీ పేరు పెడితే సరిగ్గా సరిపోతుంది. కనీవినీ ఎరుగని రీతిలో భారీ వర్షాలు వరదలతో రాష్ట్రం అల్లాడిపోతుంటే వైసీపీ మాత్రం అబద్ధపు ప్రచారాలతో, ఆధారాలు లేని విమర్శలతో చెలరేగిపోతున్నది. బెజవాడ నాలుగు రోజులుగా వరదలతో అల్లాడుతుంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పట్టించుకోలేదంటూ విమర్శిస్తున్న వైసీపీ నేతలు.. ఇన్ని రోజులూ తాము ఎక్కడున్నారన్నది మాత్రం చెప్పడం లేదు. 

వైసీపీ అధినేత జగన్ ఓ రెండు గంటలు ముంపు ప్రాంతంలో పర్యటించి అవాకులూ చెవాకులూ మాట్లాడారు. చంద్రబాబు నివాసాన్ని ముంపు నుంచి కాపాడుకోవడానికి సింగ్ నగర్ ను మంచేశారని అర్ధం పర్థం లేని విమర్శలు చేశారు. తన నివాసాన్ని కాపాడుకోవడానికి చంద్రబాబు బుడమేరు గేట్లు ఎత్తేసి సింగ్ నగర్ ను మంచేశారని చేసిన విమర్శ పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇంతటి అజ్ణానా గత ఐదేళ్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నది అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. బుడమేరు గేట్లు ఎత్తివేశారని ఓసారి, బుడమేరు నది అని మరోసారి జగన్ తన అజ్ణానాన్ని బయటపెట్టుకున్నారు. మరో వైపు జగన్ అనుకూల సోషల్ మీడియా మార్ఫింగ్ ఫొటోలతో అమరావతి మునిగిపోయిందని ప్రచారం చేసి నవ్వుల పాలైంది. వాస్తవానికి క్యాపిటల్ సిటీని చుక్క వరద నీరు కూడా తాకలేదు. 

వాస్తవాలను కప్పిపుచ్చి తన అనుకూల మీడియా, సోషల్ మీడియాలో అవాస్తవాల ప్రచారంతో తరిస్తున్న వైసీపీ బ్యాచ్.. వరద బాధితులకు అండగా నిలిచిన నేతలపై విమర్శలు గుప్పించడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. మాజీ మంత్రి ఆర్కే రోజా.. ఎన్నికలలో ఓటమి తరువాత నగరి నియోజకవర్గానికి ముఖం చాటేశారు. రాష్ట్రం దాటేసి తమిళనాడులో రాజకీయ ప్రవేశం కోసం చేసిన ప్రయత్నాలు విఫలం అవ్వడంతో రాష్ట్రానికి తిరిగి వచ్చిన రోజా.. ఇప్పుడు తగుదునమ్మా అంటూ పవన్ కల్యాణ్ వదర ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి బాధితులను పరామర్శించకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించడం విడ్డూరం. 

వైసీపీ నేతలు ఎవరూ కనీసం వరద ముంపు ప్రాంతాలవైపు కూడా కన్నెత్తి చూడని విషయాన్ని గుర్తు చేస్తూ నెటిజనులు రోజాను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఐదు రోజుల తరువాత ముంపు ప్రాంతంలో పర్యటించి ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ప్రయత్నించి మాజీ మంత్రి బొత్సకు బాధితుల నుంచే నిరసన వ్యక్తం అయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే మెండితోక జగన్మోహన్ ను వరద బాధితులు అడ్డుకుని గోబ్యాక్ నినాదాలు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. 

అధికారంలో ఉండగా నిత్యం మీడియా ముందుకు వచ్చి అప్పటి ప్రతిపక్ష పార్టీ నేతలపై ఇష్టారీతిగా బూతులతో విరుచుకుపడుతూ అడ్డగోలు విమర్శలు చేసిన కొడాలి నాని, వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్ లు ఇప్పుడు ఏ కలుగులో దాక్కున్నారని నిలదీస్తున్నారు. అలాగే రోజా కూడా నోరు విప్పితే అనుచిత వ్యాఖ్యలే అన్నట్లుగా వైసీపీ హయాంలో వ్యవహరించిన సంగతిని గుర్తు చేస్తున్నారు. అటువంటి నేతలంతా వరదల్లో జనం కష్టాల పలైన సందర్భంగా ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు.   మొత్తంగా వైసీపీ తీరు ఉలిపికట్ల చందంగా ఉంది.