కుటుంబాలను చీల్చే వ్యక్తిని కాను తల్లీ.. ముద్రగడ కుమార్తెతో పవన్ కల్యాణ్

జనసేనాని పవన్ కల్యాణ్ కు పిఠాపురంలో విజయం  నల్లేరు మీద బండి నడకే అని పరిశీలకులు నియోజకవర్గ పరిస్థితులను ఉటంకిస్తూ విశ్లేషణలు చేస్తున్నారు. మరో వైపు పవన్ కల్యాణ్ ను ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో ఉన్న వైసీపీ దాడులకు పాల్పడుతూ తన పరపతిని మరింత దిగజార్చుకుంటోంది. మెగా హీరో సాయి ధర్మ తేజపై పిఠాపురంలో జరిగిన దాడి పట్ల ప్రజలలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

సరే ఇక ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి తండ్రితో విభేదించి తన మద్దతు పవన్ కల్యాణ్ కే అని ప్రకటించడం, ముద్రగడ తన కుమార్తె తన ప్రాపర్టీ కాదు అంటూ వ్యాఖ్యనించడంతో ముద్రగడ తన పరువునే కాకుండా పార్టీ ప్రతిష్టను కూడా మంటగలిపేశారు. తాజాగా పవన్ పోలింగ్ పూర్తి కాకుండానే ప్రజల హృదయాలను గెలిచేసుకున్నారు. తన సంస్కారంతో, తన నైతిక విలువలతో నియోజకవర్గ ప్రజలను కదిలించారు. 

ఇంతకీ ఏం జరిగిందంటే.. ముద్రగడ పద్మనాభం కుమార్తె.. తండ్రితో విభేదించి తన మద్దతు పవన్ కల్యాణ్ కే అని ప్రకటించి ఊరుకోకుండా, తన భర్తతో కలిసి పవన్ కల్యాణ్ విజయం కోసం కృషి చేస్తానంటూ పవన్ కల్యాణ్ ను కలిశారు. పవన్ కోసం ప్రచారం చేస్తానని ఆయనకు చెప్పారు.  అయితే  పవన్ కల్యాణ్ సున్నితంగా తిరస్కరించారు. తాను కుటుంబాలను కలిపే వ్యక్తినే కానీ, విడదీసే వాడిని కానని ముద్రగడ కుమార్తె క్రాంతికి విస్పష్టంగా కలిశారు. ఆమెను ఇప్పుడు జనసేనలోకి ఆహ్వానించలేనని సున్నితంగానైనా చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నికల తరువాత మీ ఇంటికి వచ్చి మీ తండ్రిగారి సమక్షం మిమ్మల్ని జనసేనలోకి ఆహ్వానిస్తానని పవన్ కల్యాణ్ చెప్పిన మాటలు ఆయన పాటిస్తున్న నైతిక విలువలకు అద్దం పట్టాయి. 

తన ఓటమే లక్ష్యం అంటూ రంగంలోకి దిగిన ముద్రగడ పద్మనాభం కు తేరుకోలేని దెబ్బ కొట్టే విధంగా ఆయన కుమార్తె క్రాంతికి జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి ఉండొచ్చు. అయితే జనసేనాని ఆ ఆప్షన్ ను ఎంచుకోలేదు. తాను కుటుంబాలను చీల్చే వ్యక్తిని కానంటూ సున్నితంగా క్రాంతి జనసేన ప్రవేశాన్నినిరాకరించారు. అంతే కాదు ముద్రగడ పద్మనాభం సమక్షంలోనే ఎన్నికల తరువాత మిమ్మల్ని పార్టీలోని ఆహ్వానిస్తానంటూ చెప్పి.. తనపై అడ్డగోలు విమర్శలు చేస్తున్న ముద్రగడ పద్మనాభానికి కూడా గౌరవం ఇచ్చి ముద్రగడ స్థాయిని అందరికీ అర్ధమయ్యేలా ఎత్తి చూపారు. పవన్ కల్యాణ్ వ్యక్తిత్వంతో పోలిస్తే ముద్రగడ స్థాయి పిపీలకం కంటే తక్కువ అని జనం భావించేలా చేశారు.