ఇప్పుడు వైఎస్ భాస్కరరెడ్డి.. హైకోర్టులో పిటిషన్

వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో వేగాన్ని నిరోధించే ప్రయత్నాలలో భాగంగా తెలంగాణ హై కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ సారి పిటిషన్ దాఖలు చేసినది కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి. వివేకా హత్య కేసులో ఏ4 దస్తగిరిని సీబీఐ అప్రూవర్ గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ వైఎస్ భాస్కరరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా మమ్మల్ని నేరంలోకి నెట్టడం సమంజసం కాదని ఆయనా పిటిషన్ లో పేర్కొన్నారు.

సీబీఐ చెప్పినట్లుగా దస్తగిరి వాంగ్మూలమిస్తున్నాడని పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో దస్తగిరి కీలక పాత్ర పోషించాడనీ, అటువంటి దస్తగిరికి  బెయిల్ ఇవ్వటం సరికాదని వైఎస్ భాస్కరరెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు.

వివేక హత్య కేసులో కీలకంగా ఉన్న ఆయుధాన్ని కొనుగోలు చేసింది దస్తగిరేననీ, అటువంటి దస్తగిరికి బెయిల్ విషయంలో సీబీఐ సహకరించిందని ఆరోపించారు.  దస్తగిరికి ఇచ్చిన బెయిల్‎ను రద్దు చేయాలని కూడా భాస్కరరెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు.