జగన్ సంక్షేమం ఉట్టి మాట.. దోపిడీయే అసలు బాట!.. మదనపల్లె మినీ మహానాడులో చంద్ర నిప్పులు..

జగన్ సర్కార్ పై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. జగన్ చెబుతున్న సంక్షేమం అంతా ఉట్టి మాటేననీ, ఆయన అసలు బాట దోపిడీయేనని మండి పడ్డారు. మదనపల్లెలో జరిగిన మినీ మహానాడులో చంద్రబాబు చేసిన ప్రసంగానికి భారీ స్పందన లభించింది. ముఖ్యంగా స్కూళ్ల విలీనం, వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించడం, జగన్ బ్రాండ్ మద్యం, ధరల బాదుడే బాదుడుపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.స్కూళ్ల విలీనంపై చంద్రబాబు జగన్ ను నిలదీశారు. పేద పిల్లలు చదువులకు దూరమయ్యేలా జగన్ చర్యలు ఉన్నాయని విమర్శించారు.

హేతుబద్ధీకరణ అంటూ ఏనిమిదివేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం రాష్ట్రంలో విద్యను సర్వనాశనం చేయడమేనని మండిపడ్డారు. తన హయాంలో కిలోమీటర్ కు ఒక స్కూలు, మండలానికో కాలేజీ ఏర్పాటు చేస్తే జగన్ ఇప్పుడు స్కూళ్లను మూసేసి రాష్ట్రంలో విద్యార్థులను చదువులకు దూరం చేస్తున్నారని మండి పడ్డారు. ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీయాలనీ, తిరగబడాలనీ పిలుపునిచ్చారు.కేవలం అర్ధ శాతం అప్పుకోసం జగన్ స్కూళ్లు మూసేస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ చదువుకోలేదు కనుకనే ఇతరులు చదువుకోవడాన్ని భరించలేకపోతున్నాడని చంద్రబాబు అన్నారు. గతంలో అధికారం కోసం పాదయాత్ర పేరుతో రాష్ట్రమంతా తిరిగి ప్రజలకు ముద్దులు పెట్టిన జగన్‌.. ఇప్పుడు పన్నుల పేరుతో పిడు గుద్దులు గుద్దుతున్నారని ఎద్దేవా చేశారు.  
 రైతులు వినియోగించే వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తేల్చి చెప్పారు.    . అప్పులు తెచ్చుకోవడం కోసమే జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ లేని సమస్యలూ సృష్టించి జనాలను ఇబ్బంది పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.   మినీ మహానాడుకు జనం రాకుండా పుంగనూరులో వైసీపీ నాయకులు అడ్డుకున్నారన్నారు. తాను కన్నెర్ర చేస్తూ ఇళ్లల్లోంచి బయటకు రాలేరని వైసీపీ నేతలను హెచ్చరించారు. 
 రాష్ట్రంలో జే బ్రాండ్‌ మద్యంతో ప్రజల ఆరోగ్యంతో జగన్‌ చెలగాటమాడుతున్నారనీ,  బూమ్‌ బూమ్‌, ప్రెసిడెంట్‌ మెడల్‌, ఆంధ్రాగోల్డ్‌ వంటి పేర్లతో ముఖ్యమంత్రి మద్యం వ్యాపారం చేస్తున్నాడనీ విమర్శించారు. జే బ్రాండ్ మద్యంలో కెమికల్స్ ఉన్నాయని   రుజువైందన్నారు.

జగన్ మూడేళ్ల పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందని చంద్రబాబు విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో  అద్దాల్లా ఉన్న రోడ్లు ఇప్పుడు గుంతల మయమయ్యాయన్నారు. సోషల్‌ మీడియాలో పోస్టులపై ఎటువంటి అరెస్టులు చేయకూడదని సుప్రీంకోర్టు  స్పష్టంగా చెప్పినా రాష్ట్రంలో 600 కేసులు పెట్టారు. 180 మందిని అరెస్టు చేశారన్న చంద్రబాబు కొందరు పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారన్నారు. అటువంటి వారిపై మేం అధికారంలోకి వచ్చాకా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

 ఆర్టీసీ ధరలు మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయి. నేను దీపం పథకం ప్రవేశపెడితే జగన్‌ దానిని ఆర్పివేస్తూ గ్యాస్‌ ధరలు పెంచారు. ప్రస్తుతం వంట గ్యాస్‌ కొనే స్థితిలో మహిళలు లేరు, మళ్లీ కట్టెల పొయ్యిలే దిక్కయ్యేలా ఉన్నాయి. కోడిగుడ్లు, చికెన్‌ ధరలు కూడా సామాన్యులకు అందనంత దూరంలో ఉన్నాయి. ముస్లిం మైనారిటీల పెళ్లి ఖర్చులకు మేం దుల్హన్‌ పథకాన్ని ప్రవేశపెడితే జగన్‌ రద్దు చేశాడు. అన్న క్యాంటీన్లు,  చంద్రన్న బీమా, సంక్రాంతి కానుక.. అన్నింటినీ తీసేశాడు. జగన్ ది రద్దుల, విధ్వంసాల పాలన అని చంద్రబాబు అన్నారు.