బెయిలు దొరికినా అవినాష్ కు సుఖం లేదా?
posted on Apr 19, 2023 12:37PM
వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఐదో సారి విచారిస్తోంది. బుధవారం (ఏప్రిల్ 19) ఆయన జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుంచి బయలుదేరి కోఠీలోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. కాగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా అవినాష్ రెడ్డిని అవసరమైతే అరెస్టు చేస్తామని సీబీఐ హైకోర్టుకు గతంలోనే చెప్పింది. దాంతో ఆయన గతంలో తెలంగాణ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ దాఖలు చేశారు.
అయితే ఆ తరువాత జరిగిన పరిణామాలలో ఆ పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. ఆ తరువాత ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అప్పటి వరకు కేసు దర్యాప్తు చేస్తున్న బృందాన్ని సీబీఐ మార్చేసింది. కొత్త బృందాన్ని నియమించింది. వివేకానందరెడ్డి హత్య కేసును అప్పటి వరకూ దర్యాప్తు చేసిన సీబీఐ అధికారి రాంసింగ్‌ను సుప్రీం కోర్టు తొలగించింది. దర్యాప్తు కోసం కొత్త టీమ్‌ను నియమించి ఏప్రిల్ 30 లోగా కేసు దర్యాప్తును ముగించాలని సుప్రీం కోర్టు సీబీఐకి గడువు విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో సీబీఐ ప్రత్యేక అధికారులుగా సీబీఐ డీఐజీ చౌరాసియా నేతృత్వంలో ఎస్పీ వికాస్ సింగ్, ఏఎస్పీ ముఖేష్ కుమార్, సీఐ నవీన్ పునియా, ఎస్సై అంకిత్ యాదవ్ ను నియమించింది. దీంతో కేసు దర్యాప్తు మళ్లీ మొదటికి వచ్చిందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామాల తరువాత కొన్ని రోజుల పాటు ఎటువంటి కదలికా లేకుండా ఉన్న కేసు దర్యాప్తు.. గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్టుతో ఒక్క సారిగా వేగంపుంజుకుంది.
ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసిన రెండు రోజులలోనే ఇదే కేసులో సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిని సీబీఐ పులివెందులలో అరెస్టు చేసి హైదరాబాద్ తరలించి రిమాండ్ చేసింది. ఆ మరుసటి రోజే అవినాష్ రెడ్డిని విచారణకు రావాల్సిందిగా కోరుతూ నోటీసులు ఇచ్చింది. దీంతో అవినాష్ రెడ్డి అరెస్టు అనివార్యమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. సరిగ్గా అదే సమయంలో అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో మళ్లీ ముందస్తు బెయిలు కోసం పిటిషన్ దాఖలు చేయడం.. ఆ పిటిషన్ ను రెండు రోజుల పాటు విచారించిన కోర్టు.. అవినాష్ ను ఈ నెల 25 వరకూ అరెస్టు చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వ్యులు జారీ చేసింది. అయితే ముందస్తు బెయిలు ఊరట అవినాష్ కు దక్కిందని చెప్పడానికి వీల్లేకుండా.. 25 వరకూ ప్రతిరోజూ సీబీఐ విచారణకు హాజరు కావాలంటూ అవినాష్ ను ఆదేశించింది. అంటే టెక్నికల్ గా అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు ఇచ్చిన కోర్టు.. ప్రతి రోజూ విచారణకు హాజరు కావాల్సిందేనంటూ అవినాష్ ను ఆదేశశించడం అంటే ఒక విధంగా బెయిలు ప్రయోజనం ఆయనకు దక్కనట్టేనని న్యాయ నిపుణులు అంటున్నారు. ఇక 25 తరువాత ఏం జరుగుతుందన్న ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమౌతోంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ వివేకా హత్య కేసు దర్యాప్తును ఈ నెల 30 నాటికి ముగించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అవినాష్ విచారణ, అరెస్టు వ్యవహారం తెలుగు టీవీ డెయిలీ సీరియల్ గా కొనసాగుతుండటంతో సీబీఐ అవినాష్ కు ముందస్తు బెయిలు మంజూరు కావడంపై సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద వివేకా హత్య కేసు దర్యాప్తును సీబీఐ నిర్దిష్ట గడువులోగా ఒక లాజికల్ ముగింపునకు తీసుకువస్తుందన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమౌతోంది.