పవన్‌పై పూనమ్ కౌర్ అస్త్రం.. ఇదీ ఫేకే?

ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఇప్పటికే ప్రజలలో వ్యతిరేకత బహిర్గతం అవుతుండగా.. సొంత పార్టీ ఎమ్మెల్యేలే కొందరు అధిష్టానంపై రివర్స్ అవుతున్నారు. వచ్చే ఎన్నికలలో టికెట్లు దక్కవని అనుమానిస్తున్న నేతలు కొందరు రెబల్స్ గా మారేందుకు చాపకింద నీరులా నియోజకవర్గాలలో పనులు చక్కబెట్టుకుంటున్నారు. మరోవైపు నాలుగేళ్ళలో వైసీపీ తప్పిదాలను, వైసీపీ నేతల దారుణాలను, ప్రభుత్వం కక్షకట్టి చేసిన నష్టాన్ని ప్రతిపక్షాలు ఎండగడుతూ ప్రజలతో మమేకం అవుతున్నారు. ఒకవైపు టీడీపీ నుండి నారా లోకేష్ పాదయాత్ర చేస్తూ కార్యకర్తలలో ఒకడిగా దూసుకెళ్తూ ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు.

మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శల బాణాలతో వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ ను నిలువరించేందుకు వైసీపీ రకరకాల ఎత్తులు వేస్తున్నది. ఇప్పటికే పవన్ వ్యక్తిగత జీవితాన్ని   టార్గెట్ చేసిన వైసీపీ నేతలు జనసేన నేతలు తీవ్ర ఆగ్రహాన్ని చవిచూస్తున్నారు.

సాక్షాత్తు సీఎం జగన్ మోహన్ రెడ్డే పవన్ పెళ్లిళ్ల విషయాన్ని ప్రస్తావించి పవన్ కళ్యాణ్ కి కౌంటర్ గా వైసీపీకి ఒక లీడ్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోతున్నారు. ఇందులో భాగంగానే హీరోయిన్ పూనమ్ కౌర్ పేరిట ఒక ఫేక్ ఆడియో రికార్డును వైరల్ చేస్తున్నారు. పవన్ క్యారెక్టర్ ను బ్యాడ్ చేసేలా.. పవన్ ను స్త్రీ లోలుడిగా చిత్రీకరించేలా వైసీపీ ఈ జిత్తులు మారి  ఎత్తుగడ వేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  పవన్ కళ్యాణ్ పొలిటికల్ యాక్టివిటీ పెరిగిన ప్రతిసారీ వైసీపీ ఇలాగే పూనమ్ కౌర్ పేరిట సోషల్ మీడియాలో తెగ ఫేక్ ముచ్చట్లను తెర మీదకి తీస్తుండగా ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ గురించి పూనమ్ మాట్లాడినట్లుగా ఒక ఫేక్ కాల్ రికార్డును వైసీపీ సోషల్ మీడియా విడుదల చేసింది. 

ఈ ఆడియోలో పవన్ కల్యాణ్‌కు అమ్మాయిలతో ఉన్న సంబంధాలపై నటి పూనమ్ కౌర్ వ్యాఖ్యలు చేసినట్లు ఉంది.  ‘పవన్ కల్యాణ్‌కు చాలామంది అమ్మాయిలతో సంబంధాలున్నాయి. వాళ్లందరినీ మోసం చేశాడు. వాళ్లే కోపం వచ్చినప్పుడు వాడిని చంపొచ్చు. అంత కామమైన నీచమైన వ్యక్తి పవన్ కళ్యాణ్’ అని పూనమ్ కౌర్ అన్నట్లుగా ఆడియో సృష్టించారు. ‘నేను నోరు మూసుకున్నా పవన్‌ కళ్యాణ్‌ను చంపడానికి చాలామంది రెడీగా ఉన్నారు. ఆయన చాలామంది అమ్మాయిలతో తప్పు చేశారు. నా విషయంలో జరిగింది నేను ఫ్రూఫ్‌లు చూపిస్తే పవన్ ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు. నేను ప్రేమించాను కాబట్టి బయటకు రాలేదు. నాకు ఐ లవ్ యూ చెప్పి వేరే అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడు. పవన్ వల్ల నా పెళ్లి కూడా క్యాన్సిల్ అయింది’ అని పూనమ్ కౌర్ గొంతును పోలిన ఓ వాయిస్ రికార్డ్‌ను వైసీపీ అనుకూల వర్గాలు షేర్ చేస్తున్నాయి.

దీనిపై జనసేన కార్యకర్తలు, జనసేన సోషల్ మీడియా టీం సైతం కౌంటర్లు మొదలు పెట్టింది. ఇది ఫేక్ అని కొట్టిపారేస్తున్న జనసేన వర్గాలు.. ఆడియోలో పవన్‌ను చంపడం అనే మాట చూస్తుంటే ఏదో కుట్ర జరుగుతోందని.. పవన్‌కు ప్రాణ హాని ఉందని అనుమానిస్తున్నారు. మరికొందరు జనసేన ఫాలోవర్లయితే గతంలో మహిళలతో అసభ్యంగా మాట్లాడిన వైసీపీ నేతలు అంబటి, అవంతి లాంటి వారి ఆడియోలను మళ్ళీ షేర్ చేస్తూ.. ఇదీ మీ సంస్కృతి.. ఫేక్ ఆడియోలు, ఫేక్ వీడియోలను తెచ్చి లోకమంతా అలాగే ఉంటుందని నమ్మించేందుకు వైసీపీ ప్రయత్నిస్తున్నదని గట్టి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, పూనమ్ పేరిట తెచ్చిన ఈ ఆడియో మాత్రం వైసీపీ ఎన్నికల కోసం ఎంతకైనా దిగజారుతుందని చెప్పకనే చెబుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.