షర్మిలకు బర్త్ డే విషెస్ చెప్పని జగన్.. కారణమేంటంటే?
posted on Dec 18, 2025 9:13AM
.webp)
జగన్.. సొంత చెల్లికి కనీసం బర్త్ డే విషెస్ కూడా చెప్పని వ్యక్తిగా మరోసారి వార్తలలో నిలిచారు. ఔను జగన్ చెల్లెలు షర్మిల బుధవారం (డిసెంబర్ 17) తన జన్మదినం జరుపుకున్నారు. జగనన్న వదిలిన బాణాన్ని అంటూ తన అన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి, 2019 ఎన్నికలలో జగన్ విజయానికి తన వంతు దోహదం చేసిన చెల్లిని అధికారం చేపట్టిన తరువాత జగన్ దూరం పెట్టారు. ఆస్తుల పంచా యితీతో పాటుగా రాజకీయంగా తనకు పోటీ అవుతుందన్న భయంతోనే జగన్ షర్మిలను దూరం పెట్టారన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది.
దీంతో షర్మిల తన మకాం హైదరాబాద్ కు మార్చి కొంత కాలం వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రిగా తెలంగాణ రాజకీయాలలో కీలక భూమిక పోషించారు. అయితే.. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్ గూటికి చేరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతే కాకుండా గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. 2019 ఎన్నికలలో జగన్ విజయంలో షర్మిల కీలక పాత్ర పోషిస్తే.. 2024 ఎన్నికలలో జగన్ ఓటమిలో కూడా ఆమె తన వంతు పాత్ర పోషించారని పరిశీలకులు విశ్లేషణలు కూడా చేశారు. ఈ పోలిటికల్ డిఫరెన్సెస్ కు తోడు.. జగన్ షర్మిల మధ్య ఆస్తి వివాదాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సరస్వతి పవర్ వాటాల బదలీ వ్యవహారంలో వీరి మధ్య ట్రైబ్యునల్ లో కేసు కూడా నడుస్తోంది.
అది పక్కన పెడితే.. కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల తనవంతు పాత్ర పోషిస్తున్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, వైసీపీలపై ఘాటు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంలో ఆమె తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్ గొంతును బలంగా వినిపిస్తున్నారు. అందులో తప్పుపట్టాడినికి ఏమీ లేదు. కాగా షర్మిల జన్మదినం సందర్భంగా కూటమి నేతలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. వారికి షర్మిల ధన్యవాదాలు తెలుపుతూ బదులిచ్చారు కూడా.
అయితే సొంత అన్న జగన్ షర్మిలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయకపోవడం సరికాదని వైసీపీ వర్గాలలోనే చర్చ జరుగుతోంది. తెల్లారి లేస్తే గాంధీ డైనాస్టీ అంటూ.. సోనియా, రాహుల్, ప్రియాంకలపై విమర్శలతో విరుచుకుపడే ప్రధాని నరేంద్ర మోడీ వారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేస్తుంటారు. అంతెందుకు నిత్యం చంద్రబాబుపై ఏక వచన ప్రయోగంతో విమర్శలు గుప్పించే జగన్ కు కూడా చంద్రబాబు జగన్ పుట్టిన రోజు సందర్భంగా బర్త్ డే విషెస్ చెప్పారు. తద్వారా వారంతా విభేదించడం, భిన్నాభిప్రాయం కలిగి ఉన్నంత మాత్రాన వ్యక్తిగత వైరం ఉండనవసరం లేదని చాటారు. కానీ జగన్ మాత్రం రాజకీయంగానైనా, కుటుంబ పరంగానైనా సరే తనతో విభేదించిన వారిని శత్రువులుగా చూస్తారనడానికి సొంత చెల్లికి బర్త్ డే విషెస్ తెలపకపోవడాన్ని ఉదాహరణగా చూపు తున్నారు పరిశీలకులు.