పాపం న్యూజిలాండ్.. 183 ఆలౌట్...

 

వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకి చస్తుందని అంటారు చూశారా.. పాపం న్యూజిలాండ్ పరిస్థితి అలాగే తయారైంది. వరల్డ్ కప్ క్రికెట్‌లో కప్పు న్యూజిలాండ్‌దేనని అందరూ డిసైడ్ అయ్యారు. అందరూ అనుకుంటున్నట్టుగానే పరాజయమన్నదే ఎరగకుండా ఫైనల్‌కి చేరుకున్న న్యూజిలాండ్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్లో మాత్రం షాక్ తింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న న్యూజిలాండ్‌ మొదటి ఓవర్లో నాలుగో బంతికే కెప్టెన్ మెక్కల్లమ్ వికెట్ పోగొట్టుకుంది. మెక్కల్లమ్ డక్కౌట్ అవడం విశేషం. ఆ తర్వాత న్యూజిలాండ్ పరిస్థితి ఘోరంగా మారింది. ఆస్ట్రేలియా బౌలర్లు, ఫీల్డర్లు రెచ్చిపోవడంతో న్యూజిలాండ్ కుంటుకుంటూ పరుగులు తీయాల్సి వచ్చింది. చివరికి 45.0 ఓవర్లలో 183 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది. ఆస్ట్రేలియా జాగ్రత్తగా కనుక ఆడితే ప్రపంచ కప్ 2015 ఆస్ట్రేలియాదే అవుతుంది.