నూతన సంవత్సర శుభాకాంక్షలు
posted on Jan 1, 2016 9:11AM
.jpg)
2015సం.లో భారతదేశం, ప్రపంచం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ప్రతీ సంవత్సరంలాగే ఈసారి కూడా అనేక ఆశలతో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాము. అలాగే ప్రతీ సంవత్సరంలాగే ఈసంవత్సరంలో కూడా అనేక సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చును. ప్రపంచాన్ని అతలాకుతలం చేయగల ప్రకృతి విపత్తుల ముందు అందరూ తలవంచవలసిందే. ఈ ప్రపంచాన్ని సుఖమయం చేయడానికి అనేక అద్బుతాలు సృష్టించే మనిషే ఈ ప్రపంచానికి ఊహించని సమస్యలు, కష్టాలు కూడా తెచ్చిపెడుతుంటాడు. చివరికి ప్రకృతి విపత్తులకి కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మనిషే కారణమవడం విస్మయం కలిగిస్తుంది. డిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంతో నేటి నుండి సరి-బేసి సంఖ్యల పద్దతిలో వాహనాలను బయటకి అనుమతిస్తోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు కూడా నడుం బిగించాయి.
ఈ కాలుష్యం సరిపోదన్నట్లు రాజకీయ కాలుష్యం కూడా బాగా పెరిగిపోయింది. మన దేశంలో అయితే ఆ కాలుష్యం ఇంకా ఎక్కువగా ఉన్నట్లుంది. జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలలో కూడా ఈ రాజకీయ కాలుష్యం పెరిగిపోవడంతో సకల అవలక్షణాలను సంతరించుకొన్నాయి. ఆ కారణంగా అభివృద్ధి కేవలం హామీలకి, కాగితాలకే పరిమితమయిపోయింది. ప్రజలు ఎన్నుకొన్న ప్రజాప్రతినిధులు సర్వరాజభోగాలు అనుభవిస్తుంటే, వారికి ఆ అవకాశం కల్పించిన సామాన్య ప్రజలు జీవితాంతం త్యాగాలు చేయవలసి వస్తూనే ఉంది. ఈ పరిస్థితులలో మార్పు కలుగుతుందని ఆశించడం అత్యాశే అవుతుంది. కనుక చిన్న చిన్న సంతోషాలని విస్మరించకుండా వాటినే లెక్కబెట్టుకొంటూ ఈ సంవత్సరాన్ని కూడా ఉన్నంతలో ఆనందంగా లాగించేయాలి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.