వైసీపీకి కొత్త తిప్పలు!
posted on Nov 13, 2023 6:11AM
ఏపీలో ప్రతిపక్షాలు మూకుమ్మడిగా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్నాయి. ఎప్పటి నుండో జనసేనాని పవన్ కళ్యాణ్ ఈసారి వైసీపీకి అధికారం దక్కనివ్వమంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అనుకున్నట్లే జనసేన తెలుగుదేశంలో కలిసి ఎన్నికలకు వెడుతున్నదని తేలిపోయింది. ఇప్పటికే రెండు పార్టీలు సమన్వయ కమిటీలను కూడా నియమించుకొని సమష్టిగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. త్వరలోనే రెండు పార్టీల ఉమ్మడి మ్యానిఫెస్టో కూడా ప్రకటించనున్నారు.
ఇక వామపక్షాలు కూడా వీళ్ళతో కలిసిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో వైసీపీ ఒంటరిగా మిగలనుంది. మాకెవరితో పొత్తులు ఉండవని వైసీపీ నేతల ప్రకటనలు కోటలు దాటుతున్నా.. అసలు వైసీపీతో కలిసి వెళ్లే సాహసం ఏ పార్టీ చేసే పరిస్థితి లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీల పొత్తు వైసీపీకి ఖచ్చితంగా నష్టం చేకూర్చేదేనని ముందు నుండి తెలిసిందే కనుక వైసీపీ నేతలు.. దమ్ముంటే సింగిల్ గా పోటీ చేయాలంటూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసేవారు. కానీ తెలుగుదేశం, జనసేన వాటన్నిటికీ దీటుగా బదులిచ్చాయి. కలివిడిగా ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే రాయలసీమ నుండి అనంతపురం, కర్నూలు వంటి జిల్లాల్లో , ఉత్తరాంధ్ర నుండి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ జనసేన నేతలు తెలుగుదేశం కార్యక్రమాలకు హాజరవుతున్నారు. త్వరలోనే మిగతా ప్రాంతాలలో కూడా ఈ రెండు పార్టీలు కలిసి పని చేసేలా కార్యక్రమాలు సిద్ధం చేస్తున్నారు. కాగా, ఇప్పుడు తెలుగుదేశం,జనసేన పార్టీల పొత్తుతో వైసీపీకి కొత్త తిప్పలు వచ్చి పడ్డాయి.
వైసీపీలో చాలా మంది ఎమ్మెల్యేలు ఈసారి అదే పార్టీ నుండి, అదే నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు ఇష్టపడడం లేదు. ప్రభుత్వంపై వ్యతిరేకత తమపై కనిపించకుండా కుదిరితే పార్టీ నుండి జంప్ చేయాలనీ.. లేకపోతే కనీసం నియోజకవర్గం అయినా మారాలని ఆశపడుతున్నారు. అయితే తెలుగుదేశం, జనసేన వేరువేరుగా ఉంటే ఇలాంటి జంపింగులకు భారీ ఛాన్స్ దక్కేది. కానీ ఆ రెండు పార్టీలు ఒక్కటి కావడంతో ఆ పార్టీలలో నేతలకే స్థానాల కేటాయింపులో సర్దుబాటు చేయాల్సి వస్తుంది. దీంతో కొత్తగా ఈ పార్టీలలోకి వచ్చే నేతలకు టికెట్ హామీ కష్టమే. ఒకవేళ అలాంటి హామీలు ఇస్తే అది ఈ పార్టీలకు నష్టమే అవుతుంది కనుక ఆయా పార్టీలు కూడా జంపింగులను ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు. ఎక్కడో కొన్ని కీలక నియోజకవర్గాలలో మినహా జంపింగులకు అవకాశం దక్కడం అసంభవమే అవుతుంది. అలాంటి స్థానాలలోని వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే టీడీపీ అధిష్టానంతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. మిగతా చోట్ల జంపింగుకు అవకాశం లేని క్రమంలో వైసీపీలోనే ఉంటూ తమ నియోజకవర్గం నుంచి కాకుండా వేరే నియోజకవర్గానికి మారేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. కానీ ఆయా స్థానాలలోని ఎమ్మెల్యేలు నియోజకవర్గం మారేందుకు ఇష్టపడకపోవడంతో వైసీపీ అధిష్టానం ఇప్పుడు తలలు పట్టుకొనే పరిస్థితికి వచ్చిందపి చెబుతున్నారు.
నిజానికి వైసీపీ అధిష్టానం కూడా అసంతృప్తిని తగ్గించుకొనేందుకు ఎక్కువ మంది ఎమ్మెల్యేలను వారి నియోజకవర్గాల నుంచి పోటీకి దించకుండా మార్పు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే, కీలక స్థానాల మార్పు తప్పదన్న చోట సిట్టింగులు ససేమీరా అంటున్నారు. కావాలంటే ఈసారికి పోటీకి దూరం అవుతాం తప్ప మరోచోటకి వెళ్ళేది లేదని ఖరాకండీగా చెప్పేస్తున్నారు. దీంతో వారిని ఒప్పించడం కష్టతరంగా మారిందట. ఇక అసంతృప్తి స్థాయి ఎక్కువ ఉన్న వారికి టికెట్లు కేటాయించడం కష్టమేనని జగన్ ఇప్పటికే ప్రకటించగా.. ఈ నాయకులందరూ టికెట్ల హామీలు లేకపోయినా ప్రతిపక్ష పార్టీలలో చేరి ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు కూడా వెనుకాడేది లేదని బెదిరింపులకు దిగుతున్నట్లు పార్టీ వర్గాలలోనే ఓ టాక్ జోరుగా వినిపిస్తున్నది. ఒకవైపు టికెట్లు దక్కకపోతే రెబల్స్ పెరిగే ప్రమాదం.. మరోవైపు గెలుపు అవకాశాలు సన్నగిల్లడంతో వైసీపీలో గందరగోళ పరిస్థితి కనిపిస్తున్నది. ఇష్టం లేకపోయినా పలువురు ఎమ్మెల్యేలు పార్టీలోనే ఉంటూ పార్టీ పెద్దలకు తలపోటు తెప్పిస్తున్నారని అంటున్నారు. అటువంటి వారిపై చర్యలు తీసుకుందామంటే వారు రెబల్స్ గా మారితే మరింత ముప్పు అన్న అభిప్రాయంతో వైసీపీ అగ్రనాయకత్వం మింగలేక కక్కలేక సతమతమవుతోందని పార్టీ వర్గాలే బాహాటంగా చెప్పుకుంటున్నాయి.