పైత్యం ప్రదర్శించిన పాక్
posted on Apr 30, 2015 3:26PM
పాకిస్తాన్ ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూ వివాదంలో ఉంటుంది. అయితే ఇప్పుడు మంచి పని చేద్దామనుకొని వివాదంలో పడింది. ఏంటంటే... అసలే భూకంపం వచ్చి నేపాల్ పుట్టెడు దుఃఖంలో ఉంటే పాకిస్తాన్ ఆదేశానికి సాయం పేరిట బాగా మసాలా దట్టించిన మాంసాహారాన్ని పంపి వార్తల్లోకెక్కింది. అది కూడా వారు ఎంతో పవిత్రంగా భావించే గోవుల మాంసం. హిందువులు ఎక్కువగా ఉన్న నేపాల్ ప్రజలు గోవులను చాలా పవిత్రంగా భావిస్తారు. గోవధను అక్కడి మత సంఘాలు ఒప్పుకోవు. అలాంటిది నేపాల్ బాధితులకు పాక్ సహాయార్ధం పంపించిన బీఫ్ వల్ల వివాదం నెలకొనే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. నేపాల్ లో వైద్య సేవలు అందించడానికి వెళ్లిన భారతీయ వైద్యులు మాట్లాడుతూ పాక్ పంపించిన ఆహారపదార్ధాలలో బీఫ్ ప్యాకెట్లు ఉన్నాయని చెప్పారు. అది తెలియక మొదట స్థానికులు తీసుకున్నా తెలిసిన తరువాత పక్కన పడేశారని తెలిపారు. మరోవైపు గిడియన్స్ అనే మిషనరీ వాళ్లు బైబిళ్లు పంపించగా... నేపాల్ ప్రధాని స్పందిస్తూ, మేం బైబిళ్లు తినం... ఈ సమయంలో మాకు కావలసింది తినడానికి తిండి, నీరు కాని బైబిళ్లు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.