నేపాల్ భూకంపం మృతులు 1500
posted on Apr 26, 2015 5:37AM
నేపాల్‌లో వచ్చిన భారీ భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించడం మాత్రమే కాకుండా, 1500 మందిని పొట్టన పెట్టుకుంది. ఆదివారం ఉదయం వరకు 1500 మృతదేహాలను వెలికి తీశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం వుందని భయపడుతున్నారు. నేపాల్ రాజధాని కాట్మండూ నగరానికి 77 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ భూకంపం రిక్టర్ స్కేల్ మీద 7.8గా నమోదైందని అధికారులు చెబుతున్నారు. నేపాల్ రాజధాని కాట్మండూ భారీగా దెబ్బతింది. ఈ నగరంలోని వీధులన్నీ హాహాకారాలతో దద్దరిల్లుతున్నాయి. ఆస్పత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి. కొన్ని ప్రదేశాల్లో ఆస్పత్రులు కూడా కూలిపోయాయి. ఆస్తి, ప్రాణ నష్టంతోపాటు విద్యుత్, సమాచార, రవాణ వ్యవస్థలు పూర్తిగా నిలిచిపోవడంతో నేపాల్‌లో ఎమర్జెన్సీని విధించారు.