ఇది ఆరంభం మాత్రమే... అసలు సినిమా ముందుంది!

నెల్లూరు వైసీపీలో ముసలం ప్రారంభమయింది. పది అసెంబ్లీ స్థానాలుంటే పదింటిలోనూ వైసీసీయే గెలిచిన నెల్లూరు జిల్లాలో  ఇప్పుడు ప్రభుత్వంపై తిరుగుబాటు ఆరంభమైంది. ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వంపై నేరుగా వార్ కు దిగారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన నిరసన గళం వినిపించారు. జిల్లాకే చెందిన  మరో ఎమ్మెల్యేలో కూడా అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉందనీ, ఏ క్షణమైనా బయటపడే పరిస్థితి ఉందని చెబుతున్నారు.

అయితే నెల్లూరు జిల్లాలో ఆరంభమైన అసమ్మతి ముందుముందు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ వెలుగు చూసే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   కృష్ణా జిల్లా గన్నవరంలో గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు.. అంతకు ముందు ఎన్నికల్లో పోటీ చేసిన దుట్టా రామచంద్రారవు జగన్ సైకో.. సినిమాల్లో విలన్ లా ఉన్నారని వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. వారి వ్యాఖ్యలకు సంబంధించిన  వీడియో పార్టీలో కలకలం సృష్టిస్తోంది.  దీంతో ఈ జిల్లా, ఆ జిల్లా అన్న తేడా లేకుండా అన్ని జిల్లాల్లోని అధికార పార్టీ ఎమ్మెల్యేలలో జగన్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.

గత మూడున్నరేళ్లకు పై బడి మౌనంగా ఉన్న అధికార పార్టీ నాయకులు ఇక ముందు ముందు తమ అసంతృప్తిని వెళ్ల గక్కేందుకు ఒక్కరొక్కరుగా సిద్ధపడుతున్నారని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.  సీఎం సొంత జిల్లా కడప లో కూడా అసమ్మతి రాజుకుంటోంది.

ఎమ్మెల్యేలు బయటపడలేదు కానీ, రవీంద్రారెడ్డి, వీరశివారెడ్డి వంటి వారు తమ అసమ్మతి గళం విప్పారు.  ఇలా ఆ జిల్లా ఈ జిల్లా అని లేకుండా దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలలో అసంతృప్తి, అసమ్మతి గూడుకట్టుకుని ఉన్నాయనీ, ఏ క్షణంలోనైనా అవి బయటపడే అవకాశం  ఉందని అంటున్నారు.