నీట్ రీ ఎగ్జామ్ ఫలితాలు విడుదల 

వివాదాస్పదమైన  నీట్ పరీక్షలు రద్దయి  ఎట్టకేలకు రీ ఎగ్జామ్ కు నోచుకున్నాయి. అయితే ఇవ్వాళ నీట్ రీ ఎగ్జామ్ ఫలితాలు విడుదలయ్యాయి. నీట్ యూజీ ఫలితాల్లో 1,563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కుల కేటాయింపు వివాదాస్పదం కావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీఏ) వారికి నిర్వహించిన రీ ఎగ్జామ్ ఫలితాలు తాజాగా వెలువడ్డాయి. తమ అధికారిక వెబ్ సైట్ exams.nta.ac.in/NEET/ లో రివైజ్డ్ ఫలితాలను అందుబాటులో ఉంచామని.. రీ ఎగ్జామ్ రాసిన వారితోపాటు ఈ ఏడాది పరీక్ష రాసిన విద్యార్థులంతా రివైజ్డ్ ఫలితాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఎన్ టీఏ తెలిపింది. అయితే ఎన్ టీఏ వర్గాల సమాచారం ప్రకారం తాజా ఫలితాలతో టాపర్ల సంఖ్య తొలిసారి ప్రకటించిన 67 నుంచి 61కి తగ్గినట్లు తెలిసింది. మొత్తం 1,563 మంది విద్యార్థులకుగాను 813 మందే జూన్ 23న రీ ఎగ్జామ్ రాశారు. మిగిలిన 750 మంది విద్యార్థులు గ్రేస్ మార్కులు మినహాయించగా వచ్చే పాత స్కోర్ కే కట్టుబడతామని ఇప్పటికే తెలిపారు.

ఎంబీబీఎస్ సహా ఇతర అండర్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు మే 5న నీట్ యూజీ పరీక్షను ఎన్ టీఏ నిర్వహించింది. దేశవ్యాప్తంగా 24 లక్షల మందికిపైగా విద్యార్థులు ఈ పరీక్ష రాశారు. అయితే కొన్ని ఎగ్జామ్ సెంటర్లలో పేపర్ కాస్త ఆలస్యంగా ఇవ్వడం వల్ల పరీక్ష సమయం కోల్పోయిన 1,563 మంది విద్యార్థులకు వారు సాధించిన స్కోర్ కు అదనంగా 5 గ్రేస్ మార్కుల చొప్పున ఎన్ టీఏ కలిపింది. 

అయితే దీనిపై ఇతర విద్యార్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే ఈసారి ఏకంగా 67 మంది విద్యార్థులు 720కిగాను 720 స్కోర్ సాధించి టాపర్లుగా నిలవడం, కొన్నిచోట్ల పేపర్ లీక్ అయినట్లు ఆరోపణలు రావడంతో కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, జూలై 6 నుంచి జరిగే ఎంబీబీఎస్ కౌన్సెలింగ్ ను నిలిపేయాలని కోరారు. అయితే ఈ డిమాండ్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కేవలం గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థులకు రీ ఎగ్జామ్ నిర్వహించాలని ఎన్ టీఏను ఆదేశించింది. 

మరోవైపు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం ఎన్ టీఏ డైరెక్టర్ ను ఆ పదవి నుంచి తప్పించింది. అలాగే దీనిపై అంతర్గత దర్యాప్తు కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. నీట్ యూజీ పేపర్ లీక్ కు సంబంధించి బిహార్ లో పోలీసులు కొందరు నిందితులను అరెస్టు చేయడంతో ఈ కేసు దర్యాప్తును కేంద్రం సీబీఐకి అప్పగించింది. సీబీఐ ఇప్పటివరకు ఆరుగురు నిందితులను అరెస్టు చేసింది.