బీజేపీ ఎమ్మెల్యేకి మహిళా కమిషన్ నోటీసులు

 

బీజేపీ ఎమ్మెల్యే సాధన సింగ్‌కు జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) నోటీసులు జారీ చేసింది. బీఎస్పీ చీఫ్ మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నోటీసులు పంపింది. సాధన సింగ్‌ ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ..‘మాయావతికి ఆత్మగౌరవం అంటే ఏంటో అర్థం కాలేదు. ద్రౌపది లైంగిక వేధింపులకు గురైనప్పుడు ప్రతీకారం తీర్చుకునే వరకూ ఊరుకోనని ప్రతిజ్ఞ చేసింది. కానీ, ఈ మహిళను (మాయావతి) చూడండి.. అన్ని కోల్పోయినా అధికారం కోసం తన పరువు ప్రతిష్టలను తాకట్టుపెట్టింది...’’ అంటూ సాధనా సింగ్‌ పేర్కొన్నారు. ‘‘అధికారం కోసం మాయావతి తనను అగౌరవ పరిచిన వారితోనే చేతులు కలిపారు. ఆమె ఆడాకాదు.. మగా కాదు.. హిజ్రా కంటే దారుణం..’’ అంటూ విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళ కమిషన్ ఇవాళ ఆమెకు నోటీసులు జారీ చేసింది. ‘‘ఈ వ్యాఖ్యలు అత్యంత అసహ్యంగా, అనైతికంగా ఉన్నాయి. మహిళల ఔన్నత్యాన్ని, గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి...’’ అని ఎన్‌సీడబ్ల్యూ పేర్కొంది. ఆమె వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని  ఆదేశించింది. అయితే ఇప్పటికే తన వ్యాఖ్యలపై సాధన సింగ్ క్షమాపణ చెప్పారు.