శాంతి చర్చలకు సిద్ధం.. కేంద్రానికి నక్సల్స్ లేఖ

వరుస ఎన్ కౌంటర్లతో దెబ్బ మీద దెబ్బ తింటున్న నక్సల్స్ ఇప్పుడు శాంతి జపం చేస్తున్నారు. కేంద్రంతో శాంతి చర్చలకు సిద్ధమంటూ ముందుకు వచ్చారు. ఈ మేరకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిథి పేరిట కేంద్రానికి ఓ బహిరంగ లేఖ రాశారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాలైన  ఛత్తీస్ ఘడ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, మహారాష్ట్రలలో తక్షణమే కేంద్ర బలగాలు కాల్పులను నిలిపివేయాలని ఆలేఖలో కోరారు. తాము కూడా కాల్పుల విరమణను పాటించి శాంతి చర్చలకు సానుకూల వాతావరణాన్ని కల్పిస్తామని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ముందుకొస్తే అందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ మావోయిస్టులు ఆ లేఖలో స్పష్టం చేశారు.

ఒక వైపు కేంద్రం నక్సల్స్ ముక్త భారత్ అంటూ మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో పెద్ద ఎత్తున బలగాలను మోహరించి కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో నక్సల్స్ శాంత్రి ప్రతిపాదన చేయడం గమనార్హం. వరుస ఎన్ కౌంటర్లలో పెద్ద సంఖ్యలో నక్సల్స్ మరణిస్తున్న నేపథ్యంలో శాంతి చర్చల ప్రతిపాదన చేయడం ద్వారా మావోయిస్టులు వ్యూహాత్మకంగా శక్తియుక్తులు కూడగట్టుకోవాలని భావిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.