మీటర్లు బిగిస్తే పీకేస్తాం- జగన్ పై లోకేష్ ఫైర్
posted on Oct 30, 2020 1:10PM
ఏపీ సర్కార్ పై పోరాటంలో దూకుడు మరింత పెంచారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతులను ఎగతాళి చేస్తే జగన్‌ను గోచీతో నిలపెట్టే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. 4వేల కోట్ల అప్పు కోసం వ్యవసాయానికి మీటర్ల బిగింపు తగదన్నారు లోకేష్. వ్యవసాయ మోటార్లకు మీటర్లను అంగీకరించమని, వ్యవసాయానికి మీటర్లు బిగిస్తే వాటిని పీకేస్తామని హెచ్చరించారు. సైకిళ్లకు మీటర్లు కట్టి ఊరేగిస్తామని తేల్చి చెప్పారు లోకేష్. ఏడాదిన్నరలో 750మంది రైతులు ఆత్మహత్య చేసుకోవటమేనా రైతు రాజ్యమంటే అని ప్రశ్నించారు. నష్టం అంచనా 100శాతం చేయాలని. ఎకరాకు రూ.25వేలు పరిహారం చెల్లించాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు.
వైసీపీ సర్కార్ చేతగానితనం వల్లే పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రం యూటర్న్ తీసుకుందని లోకేష్ ఆరోపించారు. కేసుల మాఫీ కోసమే పోలవరం అంచనాలు కుదించారని, చేతకాని 22మంది ఎంపీల వల్ల పోలవరానికి రూ.30వేల కోట్లు నష్టమని వాపోయారు. పోలవరం 70శాతం పూర్తయితే మీసం తీయించుకుంటానన్న ఆ మంత్రి ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.
చెన్నైలో జగన్ కొత్త ప్యాలెస్ కడుతున్నారన్న నారా లోకేష్.. జగన్ ప్యాలెస్‌లు తనఖా పెట్టి అప్పు తెచ్చుకోవాలని సూచించారు. ఆక్వా రంగం కుదేలైనందున ఎకరాకు రూ.5లక్షలు ఇవ్వాలన్నారు. దెబ్బతిన్న పంటలకు కనీస మద్దతు ధర ప్రభుత్వం చెల్లించాలని, ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి రూ.5వేలు పరిహారం ఇవ్వాలన్నారు.