స్థానికేతరులతో కక్కిరిసిన మునుగోడు.. టీఆర్ఎస్ పై బీజేపీ ఫైర్
posted on Nov 3, 2022 2:15PM
మూడు ప్రధాన పార్టీలూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మునుగోడు నియోజకవర్గంలో స్థానికేతరుల హల్ చల్ ఎక్కువైందని బీజేపీ ఆరోపిస్తోంది. ఎన్నికల నిబంధనలను తుంగలోకి తొక్కి.. ప్రచారం గడువు ముగిసిన తరువాతా, పోలింగ్ రోజున కూడా నియోజకర్గంలోని పలు ప్రాంతాలలో స్థానికేతరులు బస చేసి ఉన్నారనీ, ముఖ్యంగా మునుగోడు నియోజకర్గంలో ప్రచారాన్ని ముందుండి నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, మంత్రులు ప్రచారం గడువు ముగిసిన తరువాత కూడా నియోజకవర్గంలోనే ఉండి పోలింగ్ బూత్ ల వద్ద ప్రచారం, సొమ్ము పంపిణీ వంటి చర్యలను ప్రోత్సహిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది.
రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నిక గురువారం (నవంబర్ 3)న ఉదయం ప్రారంభమై ప్రశాతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ దాదాపు 41శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని అధికారులు చెబుతున్నప్పటికీ.. నియోజకవర్గ పరిధిలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ముఖ్యంగా నియోజకవర్గంలో బయటి వారు ఉన్నారంటూ టీఆర్ఎస్, బీజేపీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మర్రిగూడెంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని లాఠీ చార్జ్ వరకూ వెళ్లింది. మర్రిగూడెంలో టీఆర్ఎస్ వారు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారనీ, నిబంధనలను తుంగలోకి తొక్క వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో బీజేపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు.
మర్రిగూడెంలో సిద్దపేట నంచి వచ్చిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారనీ, వారు ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రచారం చేస్తున్నారనీ బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. అలాగే పలువురు సీనియర్ నాయకులు, కొందరు మంత్రులూ కూడా నియోజకవర్గంలోనే బస చేసి ఓటర్లను ప్రభావితం చేసేలా టీఆర్ఎస్ కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. స్థానికేతరులను వెంటనే నియోజకవర్గం నుంచి పంపేయాలనీ, అంత వరకూ పోలింగ్ నిలిపివేయాలనీ డిమాండ్ చేశారు. దీంతో మర్రిగూడెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక దశలో బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు.