ఆటూ ఇటూ కాకుండా పోయిన కాపు ఉద్యమ నేత ‘ముద్ర’గడ!

కాపు సామాజిక వర్గంపై బలమైన ‘ముద్ర’ గడ సొంతం. అయితే అది ఇప్పుడు కాదు. ఒకప్పుడు. సొంత సామాజికవర్గంపై తన ఆధిపత్యం పోతుందా అన్న సందేహం ఇసుమంతైనా ఆయనలో కనిపించని రోజుల్లో కాపుజాతి కోసం అంటూ ఆయన ఉద్యమాలు చేశారు. కాపు రిజర్వేషన్ అంశాన్ని రాజకీయ పార్టీలు పట్టించుకోక తప్పని పరిస్థితి కల్పించారు. అయితే ఇదంతా గతం. ఇప్పుడు ఆయన  ‘ముద్ర’ను సొంత కుటుంబమే చెరిపేసింది.  ఆయన వైసీపీ గూటికి చేరి.. ఫ్యాన్ గాలితో  జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తానన్నారు.

 అయితే సొంత ఇంటిలోనే ఫ్యాన్ రెక్కలు తిరగడం మానేశాయి. స్వయంగా ఆయన కుమార్తె  తండ్రిని నమ్మవద్దని పిఠాపురం నియోజకవర్గ ప్రజలకే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు సామాజిక వర్గం మొత్తానికీ పిలుపు నిచ్చింది. తాను జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయం కోసం పని చేస్తానని ప్రకటించి.. తన తండ్రి ముద్రను కాపు సామాజికవర్గంలో చెరిపేసింది.   దీంతో స్వయంప్రకటిత కాపు ఉద్యమ నేత ‘ముద్ర’ పద్మనాభానికి ఇక లేకుండా పోయింది. 

పిఠాపురంలో పవన్ కల్యాణ్ జోరును అడ్డు కోవాలంటే కాపు సాజాజిక వర్గంలో తనదైన ‘ముద్ర’ ఉన్న పద్మనాభం ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం ఒక్కటే మార్గమని భావించిన వైసీపీ అధినేత సీఎం జగన్  బోల్తాపడ్డారు. నాయకుడుగా ముద్రగడ వైఫల్యాలు తుని ఘటనతోనే బహిర్గతమయ్యాయి. ఆ తరువాత ఉప్మా ఖర్చులు అంటూ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి పేరు ఎత్తిన రోజునే  కాపు యువతలో ఆయన ‘ముద్ర’ చెరిగిపోయింది. ఇప్పుడు.. ఇక పిఠాపురంలో జనసేన కోసం ఆయన ప్రచారంలో చెస్తున్న వ్యాఖ్యలు సొంత కుమార్తెకే వెగటు కలిగిస్తున్నాయంటే.. ఆయన పరువు ఏ గంగలో కలిసిందో ఆయనే చెప్పుకోవాలి.  ఇక సొంత కుమార్తె వద్దే చెల్లని ముద్ర  ఇక బయట కాపు సామాజిక వర్గంలో ఏం చెల్లుతుందని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.  తండ్రిపై కూతురు ఎగురవేసిన తిరుగుబావుటా.. కాపు సామాజికవర్గంలో తనకు ఉందని ఆయన స్వయంగా చెప్పకుంటున్న ఇమేజిని డ్యామేజీ చేసి గ్యారేజీకి పంపేసింది.  

అన్నిటికీ మించి ముద్రగడ బానిసలా మారిపోయారనీ, జగన్ ఏం మాట్లాడమంటే అది మాట్లాడుతూ, జగన్ పవన్ ను ఏం తిట్టమంటే అది తిడుతున్నారనీ సొంత కుమార్తె ఇచ్చిన వీడియో సందేశం ఏపీ రాజకీయాలలో ఒఖ సంచలనంగా మారింది. ఇప్పుడిక వైసీపీ కూడా ముద్రగడ విషయంలో పునరాలోచనలో పడినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ముద్రగడను ముందుపెట్టి.. కాపు సామాజికవర్గ ఓట్లను దండుకునే అవకాశం అటుంచి,  అసలు ఆయన తమ పక్కన ఉండటమే మైనస్ గా మారిందన్న భావన ఆ పార్టీలో వ్యక్తం అవుతోంది. దీంతో ఆయనను పక్కన పెట్టేయడమే బెటర్ అని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.