కొత్త అల్లుడికి 125 రకాల రుచులతో సంక్రాంతి భోజనం.. ఎక్కడో తెలుసా.. 

ఎంతైనా గోదావరి జిల్లాల వారి మర్యాదలే వేరు అంటారు మన పెద్దలు. సాధారణ రోజుల్లోనే ఇంటికి వచ్చిన అతిథులకు కడుపు నిండుగా రకరకాల వంటలు వడ్డించి మెప్పిస్తారని పేరుంది. అదే సంక్రాంతి లాంటి పెద్ద పండుగకు కొత్తగా వచ్చిన ఇంటల్లుడు ఐతే ఇక చెప్పేదేముంది. రకరకాల పిండివంటలు, నాన్ వెజ్ ప్రియులైతే మసాలా ఘుమఘుమలతో కూడిన ఐదారు రకాల వంటకాలతో ఆ మర్యాదే వేరుగా ఉంటుంది. తాజాగా సంక్రాంతి పండుగకు వచ్చిన ఆ ఇంటి కొత్త అల్లుడికి భీమవరానికి చెందిన ఒక కుటుంబం ఏకంగా 125 రకాల రుచులను వడ్డించిన విషయం తాజాగా వైరల్ అవుతోంది. భీమవరం పట్టణానికి చెందిన కురిశేటి కాశీవిశ్వనాధం కుటుంబం కొత్త అల్లుడికి స్వీట్లు, పిండివంటలు, ఐస్ క్రీమ్ అన్ని కలిపి 125 రకాల రుచులను అరటి ఆకు పరిచి దానిలో వెండి పళ్లెం లో వడ్డించారు. దీంతో ఉంగుటూరుకు చెందిన ఆ అల్లుడు నారాయణ అఖిల్ ముందు ఆశ్చర్యపోయినా తరువాత మెల్లగా తేరుకుని ఆరగించేసారు.