పది నెలల కొడుకుకు విషమిచ్చి తల్లి సూసైడ్

 

 

హైదరాబాద్‌ నగర శివారులోని మీర్‌పేట్ ప్రాంతంలో చోటు చేసుకున్న విషాదకర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఒక తల్లి తన పది నెలల పసికందుకు విషమిచ్చి అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడిన హృదయవిదారక ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. మీర్‌పేట్‌కు చెందిన సుస్మితకు యశ్వంత్ రెడ్డితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు పది నెలల వయసున్న కుమారుడు యశ్వవర్ధన్ రెడ్డి ఉన్నాడు. యశ్వంత్ రెడ్డి చార్టెడ్ అకౌంటెంట్‌గా పని చేస్తు న్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

అయితే గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని, కుటుంబ కలహాలు తీవ్ర స్థాయికి చేరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన సుస్మిత తన కుమారుడికి విషమిచ్చి అనంతరం తానూ ఆత్మ హత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తు న్నారు. ఘటన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకోగా, కూతురు సుస్మితతో పాటు పసికందు యశ్వవర్ధన్ మృతదేహాలను చూసి అమ్మమ్మ తీవ్రంగా కలత చెందింది. ఈ షాక్‌ను తట్టుకోలేక ఆమె కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆమె హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నది. సమాచారం అందుకున్న మీర్‌పేట్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ పరిస్థితులు, ఇతర కారణాలపై పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టారు. ఈ దారుణ ఘటనతో మీర్‌పేట్ ప్రాంతం మొత్తం విషాదంలో మునిగిపోయింది. ఒక కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ విధంగా ఒక కుటుంబం పూర్తిగా ఛిన్నాభిన్నం కావడం పట్ల స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu