ముద్రగడ టిఫిస్ సెంటర్.. ఉప్మా డబ్బులు ఇవిగో అంటూ మనీయార్డర్లు

ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో ఇప్పుడు కాపు సామజిక వర్గ ఓటర్ల కోసం పెద్ద యుద్ధమే మొదలైంది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఈ సామజిక వర్గాన్ని ఔట్ రేటెడ్ గా తన ఖాతాలో వేసుకోవాలని ప్రణాళికలు రచించి అమలు చేస్తుంటే.. దాన్ని అడ్డుకొనేందుకు అధికార వైసీపీ రకరకాల పన్నాగాలు వేస్తుంది. మొత్తంగా ఇప్పుడు కాపులు సెంటర్ పాయింట్‌గా మారిపోయారు. కాపుల మద్దతు విపక్షానికి దక్కకుండా ఎలాగైనా అడ్డుకోవాలనే పన్నాగంలో భాగంగానే ముద్రగడలాంటి పాత కాపులను వైసీపీ ప్రయోగిస్తోంది. చాలాకాలం సీరియస్ నేతగా తనపై ఉన్నముద్ర  ఇంత కాలం నిలబెట్టుకున్న ముద్రగడ ఇప్పుడు జగన్ కోసం ద్వారంపూడికి మద్దతుగా పవన్ కల్యాణ్‌పై విమర్శలకు దిగి దిగజారారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఘాటుగా ఓ లేఖ రాసిన ముద్రగడ ఇప్పుడు తాజాగా మరో లేఖ కూడా రాశారు.

లేఖలతో ముద్రగడపై కాపు సామాజికవర్గంలో వ్యతిరేకత మొదలవగా జనసైనికులలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీని పర్యవసానంగా ఇప్పుడు ముద్ర గడకు ఉప్మా డబ్బుల మనీ ఆర్డర్ల వెల్లువ మొదలైంది. ప‌వ‌న్‌ను టార్గెట్ చేస్తూ ఇటీవ‌ల  లేఖ రాసిన ముద్ర‌గ‌డ వైసీపీకి అమ్ముడుపోయాడంటూ రెండు రోజులుగా సోష‌ల్ మీడియాలో ఆయ‌న తీరును తీవ్రంగా ఎండగడుతున్నారు. ఈ క్రమంలోనే ఉభయగోదావరి జిల్లాల కాపు సామజిక వర్గ యువత ఇప్పుడు వినూత్నంగా ఓ నిరసన మొదలు పెట్టారు. గ‌తంలో కాపు ఉద్య‌మ స‌మ‌యంలో ఉద్య‌మ కార్య‌క్ర‌మాల‌కు వ‌చ్చిన యువ‌త‌కు ద్వారంపూడినే ఉప్మా పెట్టించార‌ని.. వారి త‌ర‌లింపుకు లారీలు ఏర్పాటు చేశార‌ని ముద్రగ‌డ త‌న లేఖ‌లో పేర్కొన్నారు. దీంతో అప్పుడు నాడు ఆ కార్యక్రమానికి వెళ్లిన యువత ఇప్పుడు ఇవిగో నీ ఉప్మా డబ్బులు అంటూ ముద్రగడకి మనీ ఆర్డర్లు పంపిస్తున్నారు.

జ‌న‌సేన నేత పంతం నానాజీ ముందుగా ఈ మనీ ఆర్డర్ల నిరసన మొదలు పెట్టారు. తాము తిన్న ఉప్మాకు బ‌దులుగా వెయ్యి రూపాయలు పంపిస్తున్నా అంటూ నానాజీ ముద్ర‌గ‌డ‌కు మ‌నీయార్డ‌ర్ చేశారు. అదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విష‌యం తెలిసిన జ‌న‌ సైనికులు పెద్ద ఎత్తున అదే త‌ర‌హాలో ముద్ర‌గ‌డ‌కు మ‌నీయార్డ‌ర్ పంప‌డానికి క్యూ కట్టారు. జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు, కాపు సామజిక వర్గ యువత ముద్రగడకు రూ.1000 రూపాయలు చొప్పున మనీ ఆర్డర్ పంపుతున్నారు. దీనికోసం భారీ సంఖ్యలో యువకులు పోస్ట్ ఆఫీస్ ల వద్ద క్యూ కట్టారు. తెలియక ఆయనతో ఉప్మా తిన్నామని.. ఇప్పుడు తప్పు తెలుసుకున్నామని.. మనీ ఆర్డర్ పంపే ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు.

నిజానికి సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌ల్లో ఒక‌రైన ముద్ర‌గ‌డ పద్మ‌నాభంకు ఒక‌ప్పుడు కాపు యువ‌త‌లో మంచి క్రేజే ఉండేది. కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల కోసం ఆయ‌న ఉద్య‌మించిన స‌మ‌యంలో ల‌క్ష‌లాదిగా యువత ఆయ‌న వెంట న‌డిచారు. అయితే, 2019 ఎన్నిక‌లకు ముందు కాపుల‌కు రిజర్వేష‌న్లకు సుముఖంగా ఉన్న చంద్ర‌బాబును కాదని.. ఆ ప్ర‌తిపాద‌న‌కు నో చెప్పిన జ‌గ‌న్ కు ముద్ర‌గ‌డ‌ మద్దతు ఇచ్చారు. కానీ.. గ‌త నాలుగేళ్ల‌లో ఆ వ‌ర్గానికి జ‌గ‌న్ చేసిందేమీ లేకపోగా కాపు రిజర్వేషన్లు అయ్యే పని కాదని తెగేసి చెప్పారు. అంతకు ముందు ప్రభుత్వ ప్రతిపాదనలను సైతం పక్కన పెట్టేశారు. దీంతో ఆ సామజిక వర్గంలో ముద్రగడపై వ్యతిరేకత మొదలైంది. అయితే, ఇప్పుడు ఆయన్నే వైసీపీ.. పవన్ కళ్యాణ్ ను ఆ సామజిక వర్గానికి దూరం చేసేందుకు పావుగా వాడుకుంటుంది. ఈ క్రమంలోనే ఇలా నిరసనలు చూడాల్సి వస్తుంది. మరి.. దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu