పెద్దారెడ్డి వర్సెస్ జేసీ.. తాడిపత్రిలో హై టెన్షన్
posted on Jul 27, 2021 11:02AM
అనంతపురం జిల్లా తాడిపత్రి భగ్గుమంటోంది. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి పోటాపోటీ రాజకీయాలతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అక్రమ కట్టడాల కూల్చివేతపై ఇద్దరు నేతలు పంతాలకు పోతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ కనిపిస్తోంది. సీపీఐ కాలనీలో కూల్చివేతలకు వ్యతిరేకంగా తహశీల్దార్ కార్యాలయం దగ్గర జేసీ ప్రభాకర్ రెడ్డి ధర్నాకు దిగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వందలాది మంది పోలీసులను మోహరించారు.
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అయితే కొన్ని రోజులుగా పట్టణంలో అక్రమ కట్టడాల పేరుతో కూల్చివేతలు జరుగుతున్నాయి. అక్రమ కట్టడాల కూల్చివేత వెనుక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి పాత్ర ఉందన్నది జేసీ ప్రభాకర్ ఆరోపణ. ఈ ఇష్యూపై ఇద్దరి మధ్య మాటకు మాట కూడా కొనసాగింది. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రమంతా టీడీపీ ఓడిపోతే.. తాడిపత్రిలో మాత్రం గెలిచింది. జేసీ చైర్మన్ కావడాన్ని ఎమ్మెల్యే పెద్దారెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే జేసీని సీటు నుంచి దించేందుకు ఎమ్మెల్యే స్కెచ్ వేశారని చెబుతున్నారు. అందులో భాగంగానే జేసీకి మద్దతుగా ఉన్న సీపీఐ కౌన్సిలర్ ను టార్గెట్ చేశారని అంటున్నారు.
సీపీఐ కౌన్సిలర్‌ను డైరెక్ట్‌గా కాకుండా.. ఇన్‌డైరెక్ట్‌గా బెదరకొట్టాలన్న వ్యూహాంలో భాగంగానే సీపీఐ కాలనీలో కూల్చివేతలకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. సీపీఐ కౌన్సిలర్ ఉన్న కాలనీలోని మున్సిపల్ స్థలంలో కొందరు అక్రమంగా ఇళ్లు కట్టుకున్నారని..అధికారులు నోటీసులిచ్చారు. ఇళ్ల కూల్చివేతకు మార్కింగ్ కూడా ఇచ్చారు. ఈ అక్రమ ఇళ్ల లిస్టులో జేసీకి సపోర్ట్ చేసిన ఓ సీపీఐ కౌన్సిలర్ కూడా ఉన్నారటంటున్నారు.ఎమ్మెల్యే ప్లాన్ కు కౌంటర్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి రంగంలోకి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తనకు మద్దతు ఇచ్చినందుకే సీపీఐ కౌన్సిలర్ ను బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్న జేసీ.. బాధితులకు మద్దతుగా రోడ్డెక్కారు.
కూల్చివేతలపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి పట్టుదలగా ఉండటం.. అడ్డుకుంటానని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి శపథం చేస్తుండటంతో తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత జనవరిలోనూ ఇలాంటి పరిస్థితులే తలెత్తాయి. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఏకంగా జేసీ ఇంటికే వెళ్లారు. ఆయన సీట్లు కూర్చుని హంగామా చేశారు. దీంతో గత జనవరిలో జరిగిన ఘటనలను గుర్తు చేసుకుంటూ తాడిపత్రి జనాలు ఆందోళనకు గురవుతున్నారు.