సుప్రీం మెట్లెక్కిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివాదం
posted on Nov 4, 2023 12:24PM
తెలంగాణ ఎన్నికలకు ఇంకా కేవలం 25 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఆయన ఎన్నిక చెల్లదని న్యాయవాది రాఘవేంద్ర రాజు చేస్తున్న పోరాటం సుప్రీం మెట్లెక్కింది. 2018 ఎన్నికలలో శ్రీనివాస్ గౌడ్ తప్పుడు అఫిడవిట్ సమర్పించి ఎమ్మెల్యేగా గెలిచినట్లు అదే జిల్లాకు చెందిన న్యాయవాది ఆరోపిస్తూ పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు విచారణ చేపట్టి తీర్పు ఇచ్చింది. శ్రీనివాస్ గౌడ్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అఫిడవిట్ సరిగ్గానే ఉందని తన తీర్పులో హైకోర్టు పేర్కొంది. దీన్ని సవాల్ చేస్తూ న్యాయవాది సుప్రీంనాశ్రయించారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ నేత, తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో శ్రీనివాస్ గౌడ్ తప్పుడు అఫిడవిట్ సమర్పించారంటూ మహబూబ్ నగర్ కు చెందిన రాఘవేంద్రరాజు అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఇటీవలే పిటిషన్ ను కొట్టి వేసింది. దీంతో, హైకోర్టు తీర్పును రాఘవేంద్రరాజు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. రాఘవేంద్రరాజు పిటిషన్ పై సుప్రీంకోర్టులోని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. రాఘవేంద్రరాజు పిటిషన్ పై సమాధానం చెప్పాలంటూ శ్రీనివాస్ గౌడ్ కు నోటీసులు జారీ చేసింది.