నిర్మలమ్మ పద్దుపై మధ్యతరగతి ఆశలు!
posted on Jul 23, 2024 10:33AM
కేంద్ర విత్త మంత్రి నిర్మలాసీతారామన్ మంగళవారం (జులై 23)న లోక్ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. మోదీ 3.0 ప్రభుత్వంలో ఇదే తొలి బడ్జెట్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మల వరుసగా ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రసంగిస్తారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం పూర్తిస్థాయి బడ్జెట్ ను పార్లమెంట్ ముందు ఉంచనుంది. నిత్యావసరాలు సహా అన్నింటి ధరలు మండిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యతరగతి ప్రజలు పన్ను ఉపశమనాలపై పెట్టుకున్న ఆశలను నిర్మలా సీతారామన్ పరిగణనలోకి తీసుకుంటారో లేదో మరి కొద్ది సేపటిలో తేలిపోతుంది. మధ్యతరగతి జనాలు మాత్రం నిర్మలమ్మ పద్దుపై కోటి ఆశలు పెట్టుకున్నారు.
నిర్మలమ్మ బడ్జెట్ లో పారిశ్రామిక వర్గాలకు ప్రాధాన్యం దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ, అలాగే ఎంఎస్ఎంఈ లకు ఊరట కలిగించేలా బడ్జెట్ ఉంటుందని ఆర్థిక నిపుణులుచెబుతున్నారు. అభివృద్ధి, సంక్షేమాల మధ్య సమతూకం పాటిస్తూ ద్రవ్యోల్బణం నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
సోమవారం ప్రవేశపెట్టిన ఎకనమిక్ సర్వే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేలా, భారత ఆర్థిక వ్యవస్థకు ప్రతిబింబంలా ఉందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. పదేళ్ల ఎన్డీయే పాలనలో తీసుకు వచ్చిన సంస్కరణల ఫలితాలను ఈ సర్వే ప్రతిఫలించిందని అన్నారు.