తెదేపాకు మాధవరం గుడ్ బై

 

శాసనమండలి ఎన్నికల ముందు తెదేపాకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. కూకట్ పల్లి యం.యల్యే. మాధవరం కృష్ణారావు ఈరోజు తెదేపాను వీడి తెరాసలో చేరిపోయారు. ఆయన ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరారు.

 

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “ఇంతవరకు నన్ను ఎంతో ప్రోత్సహించిన తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి, ఆయన కుమారుడు లోకేష్ కి ఇద్దరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. వారిరువురి పట్ల నాకు గౌరవమే తప్ప ఎటువంటి ద్వేషభావమూ లేదు. నా నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను తెరాసలో చేరాను తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదు.” అని అన్నారు.

 

ఆయన తెరాసలో చేరాలనుకొంటున్నట్లు చాలా కాలంగానే చెపుతున్నారు. చివరికి ఈరోజు పార్టీ మారారు. కానీ పార్టీకి అత్యవసరమయిన మండలి ఎన్నికల సమయంలో మారడమే తెదేపా నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మండలి ఎన్నికలలో తెరాస తనకు తగినంత బలం లేకపోయినప్పటికీ 5వ అభ్యర్ధిని నిలబెట్టి, ప్రతిపక్ష పార్టీల యం.యల్యేలను ఈవిధంగా ఫిరాయింపులకి ప్రోత్సహించడాన్నిప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.

 

కాంగ్రెస్, తెదేపాలు రెండూ కూడా తమ యం.యల్యేలందరూ కూడా కేవలం తమ పార్టీ అభ్యర్ధులకే తప్పనిసరిగా ఓటు వేయాలని విప్ జారీ చేసాయి. నేటికీ తెదేపా యం.యల్యేలుగా ఉంటూ తెరాసలో కొనసాగుతున్నవారికి కూడా ఆ విప్ లేఖలు అందజేశాయి. కనుక మాధవరం కృష్ణారావుతో సహా తెరాసలో కొనసాగుతున్న తెదేపా, కాంగ్రెస్ యం.యల్యేలు అందరూ తెరాస అభ్యర్ధికి ఓటు వేసినట్లయితే వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. మరి అప్పుడు తెరాస తన 5వ అభ్యర్ధిని ఏవిధంగా గెలిపించుకొంటుందో వేచి చూడాలి.