లోకేష్ దే మంగళగిరి!

మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ముందే విజయం ఎవరిదో ఖరారైపోయింది. ఈ విషయంలో ఇంకా నమ్మని వాళ్లెవరైనా ఉంటే.. ప్రచారంలో భాగంగా అధికార పార్టీ అభ్యర్థికి అడుగడుగునా ఎదురౌతున్న పరాభవాల పరంపరను చూస్తే అర్ధమైపోయింది. మంగళగిరి నియోజవకర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి అంతగా అచ్చిరాని మంగళగిరి నియోజకర్గాన్ని లోకేష్ తొలి సారి ఎంచుకుని పోటీకి దిగినప్పుడే చాలా మంది అరెరె ఎందుకిలా అనుకున్నారు. అయితే సవాళ్లను స్వీకరించి పోరాడటమే తన నైజమని చాటుతూ 2019 ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుంచి లోకేష్ పోటీ చేశారు. ఆ ఎన్నికలలో ఆయన వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. 

సాధారణంగా ఎన్నికలలో ఓడిపోయిన అభ్యర్థి మళ్లీ ఎన్నికలు వచ్చే వరకూ నియోజకవర్గంలో కనిపించడం అరుదు. అయితే నారా లోకేష్ అందుకు భిన్నం. పరాజయం పాలైన నియోజకవర్గం నుంచే మళ్లీ పోటీ చేస్తానని ప్రకటించి ఈ ఐదేళ్లూ నియోజకవర్గాన్ని అంటిపెట్టుకునే ఉన్నారు.  ప్రజల సంక్షేమం కోసం పాటుపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధికి అంకితమై మంగళగిరి ప్రజలకు అండగా నిలిచి వారి గొంతుకలా మారి అధికార వైసీపీ అక్రమాలూ, దౌర్జన్యాలను ప్రశ్నించారు. నిలదీశారు.  గత ఐదేళ్లలో వివిధ సమస్యలపై ప్రస్తుత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని లోకేష్ నిరంతరం ప్రశ్నించారు. లోకేష్ చిత్తశుద్ధిని గమనించిన  మంగళగిరి ప్రజలు  ఈ సారి తమ ఓటు లోకేష్ కే అన్న నిర్ణయానికి ఎప్పుడో వచ్చేశారు. మంగళగిరిలో లోకేష్ ఆదరణను గమనించిన వైసీపీ అక్కడ ఒకరు కాదు, ఇద్దరు  అభ్యర్థులను మార్చి చివరికి మురుగుడు లావణ్యను పార్టీ అభ్యర్థిగా నిలిపింది.

సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అయితే లోకేష్ పై విజయం సాధించడం సాధ్యం కాదని భావించిన వైసీపీ అధినేత జగన్, తెలుగుదేశం పార్టీ నుంచి గంజి చిరంజీవిని చేర్చుకుని మరీ ఆయనను పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. మళ్లీ ఆయనను కూడా కాదని  మురుగుడు లావణ్యను పోటీకి దింపింది. ఈ మార్పులూ చేర్పులూ ఏవీ నియోజకవర్గ ప్రజలలో లోకేష్ పై ఉన్న అభిమానాన్ని ఇసుమంతైనా తగ్గించలేకపోయాయి. నియోజకవర్గం మొత్తం లోకేష్ వైపు మొగ్గు చూపుతోందని ఎన్నికల ప్రచారం సందర్భంగా లోకేష్ కు అడుగడగునా లభిస్తున్న జననీరాజనమే సాక్ష్యంగా నిలుస్తోంది. తాజాగా వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్య  ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓట్లడుగుతున్న సందర్భంలో  ఓ వృద్ధురాలు తన  ఓటులోకేష్‌కే అని కుండబద్దలు కొట్టడమే కాకుండా, జగన్  పథకాల కంటే లోకేష్ వల్లనే ఎక్కువ లబ్ధి పొందుతామని తెగేసి చెప్పింది. అందుకు సంబంధించిన వీడియో  ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.