జనం మనిషి లోకేష్.. మొదటి రోజును మించి రెండో రోజు

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర రెండో రోజు ముగిసింది. మొదటి రోజుతో పోలిస్తే లోకేష్ గళం మరింత పదునెక్కింది. సమస్యలపై, ప్రభుత్వ విధానాలపై మరింత సూటిగా, స్పష్టంగా జనం హృదయాలలో నాటుకునేలా ఆయన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది.  లోకేష్ పాదయాత్ర అనగానే అధికార పార్టీ నేతల్లో ఎందుకంత గాభరా అన్న విషయం అర్ధమైపోయింది.  

విదేశాలలో విద్యాభ్యాసం చేసి వచ్చిన యువకుడు.. ఇక్కడి పరిస్థితులను, ఇక్కడి ప్రజల నాడిని అర్ధం చేసుకుని.. జనంలో కలిసి వారికి దగ్గర కాగలడా అన్న అనుమానాలు ఎవరిలోనైనా ఏ మూలనో ఇంకా మిగిలి ఉంటే.. లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన రెండో రోజే అవన్నీ పటాపంచలైపోయి ఉంటాయి.  రెండో రోజు పాదయాత్రలో భాగంగా శనివారం (జనవరి 28) ఉదయం పేస్ మెడికల్ కాలేజీ విద్యార్థులతో ముచ్చటించి పాదయాత్ర ప్రారంభించారు.   బీసీ సంఘాలతో సమావేశం అయ్యారు. బీసీ సంఘాల నేతలతో కాకుండా నేరుగా   ప్రజలతో సంభాషించారు.

తెలుగుదేశం అధికారంలోకి వచ్చాకా.. సమస్యలు పరిష్కరించి, ఉపాధి కల్పించి, ఆర్థికంగా మెరుగైన జీవనాన్ని కల్పిస్తామన్న భరోసా ఇచ్చారు. ప్రజలతో మమేకం అవ్వడంలోనూ కొత్త ఒరవడికి నాంది పలికారు. తాను నడుస్తుంటే జనం తన వద్దకు వచ్చిన వారిని పలకరిస్తూ ముందుకు సాగడమే కాదు.. పొలాలలో పని చేసుకుంటున్న వారి వద్దకు స్వయంగా వెళ్లి  పలకరించి, వారి సమస్యలను సావధానంగా విన్నారు.

విద్యార్థులతో  డిగ్రీ కాలేజీ విద్యార్థులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇలా అన్ని వర్గాల వారితోనూ సంభాషిస్తూ లోకేష్ సాగుతున్న తీరు అందరినీ మెప్పిస్తోంది. ప్రజలు చెప్పే సమస్యలను శ్రద్ధగా వింటున్నారు, వారి సమస్యలకు జగన్ సర్కార్ విధానాలు ఎలా కారణమయ్యాయో వారికి వివరిస్తున్నారు. తమ ప్రభుత్వం వచ్చాకా వాటిని ఎలా పరిష్కరిస్తామో చెబుతున్నారు. మొత్తంమీద లోకేష్ అడుగులు, మాటలు ప్రజలకు భరోసా ఇచ్చేలా సాగుతున్నాయి.