విజయోత్సవాన్ని తలపించిన లోకేష్ నామినేషన్ ర్యాలీ

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నామినేషన్ దాఖలు సందర్భంగా మంగళగిరిలో పండుగ వాతావరణం కనిపించింది. నామినేషన్ దాఖలు సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి మంగళిగిరి నియోజకవర్గం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలు ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వచ్చారు.

లోకేష్ నామినేషన్ సందర్భంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చారు. మిద్దెసెంటర్, వైష్ణవి కళ్యాణమండపం, పాతబస్టాండు మీదుగా సాగిన నామినేషన్ ర్యాలీ విజయోత్సవాన్ని తలపించిందని మంగళగిరి వాసులు చెబుతున్నారు.  ర్యాలీ సందర్భంగా  డిజె సౌండ్లు, డప్పుశబ్ధాలు, బాణాసంచా మోతలతో మంగళగిరి పట్టణం మోతెక్కిపోయింది. కాగా తండ్రి   మంగళగిరి తెలుగుదేశం సమన్వయకర్త నందం అబద్దయ్య, జనసేన సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాసరావు, బిజెపి సమన్వయకర్త పంచుమర్తి ప్రసాద్ ఆధ్వర్యంలో లోకేష్ తరఫున  2సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.

నామినేషన్ల దాఖలుకు ముందు మంగళగిరి శ్రీ సీతారామ ఆలయంలో నామినేషన్ పత్రాలతో కూటమి నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం బయట సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం భారీ ర్యాలీగా    మంగళగిరి మిద్దె సెంటర్, వైష్ణవి కల్యాణమండపం, పాత బస్టాండ్ సెంటర్ మీదుగా మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం కూటమికి చెందిన ఎస్సీఎస్టీ, బీసీ మైనారిటీ నేతలు లోకేష్ తరఫున నామినేషన్ దాఖలు చేశారు.