ఆలయంలో మద్యం బాటిళ్లు పంచిన బీజేపీ నేత

 

సభలు,ర్యాలీలు నిర్వహించినప్పుడు కార్యకర్తలకు టిఫెన్‌, బిర్యానీ పొట్లాలు పంచటం సర్వసాధారణం. కానీ ఓ బీజేపీ నాయకుడు ఏకంగా మద్యం బాటిళ్లు పంచి వివాదంలో చిక్కుకున్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హర్దోయి పట్టణంలో  బీజేపీ నాయకుడు నరేష్ అగర్వాల్ కుమారుడు నితిన్ అగర్వాల్‌ స్థానిక శ్రావణ దేవి ఆలయ ఆవరణలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో నాయకుడి అనుచరులు, కొంత మంది పిల్లలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆహార ప్యాకెట్లు పంచారు. అయితే ఆ పాకెట్లను తెరిచేసరికి ఆహారంతోపాటు అందులో మద్యం సీసాలు ఉన్నాయి. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వీటిని చిన్న పిల్లలకు కూడా అందించడం వివాదాస్పద అంశంగా మారింది. కాగా ఈ ఘటనపై స్పందించిన హర్దోయ్‌ బీజేపీఎంపీ అన్షుల్‌ వర్మ.. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. ఇలాంటి కార్యక్రమాల్లో గతంలో భాజపా నాయకులు పిల్లలకు పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేసేవారని, వీరు మాత్రం ఏకంగా మద్యమే పంచుతున్నారని విమర్శించారు. ఇంత భారీ స్థాయిలో మద్యం పంపిణీ జరుగుతోంటే ఎక్సైజ్‌ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేష్‌ అగర్వాల్ ని బీజేపీలో చేర్చుకోవడంపై పార్టీ నాయకత్వం మరోసారి ఆలోచించాలని అభిప్రాయపడ్డారు. ఇటీవలే సమాజ్‌వాది పార్టీ నుంచి నితిన్‌ తండ్రి నరేష్‌ అగర్వాల్‌  బీజేపీలో చేరారు.