బిఆర్ఎస్ అధినేత కెసీఆర్ కు సీతక్క జలక్ ... లీగల్ నోటీసులు జారీ 

ఆరోపణలు ప్రత్యారోపణలు రాజకీయాల్లో మామూలే. అయితే బిఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ నేతలు సీరియస్ గానే స్పందిస్తున్నారు. గత కెసీఆర్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవకతవకలకు పాల్పడ్డారని కాంగ్రెస్ ఆరోపణలు చేసింది.  రిటైర్డ్ హైకోర్టు జడ్జి నర్సిరెడ్డి నేతృత్వంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమిషన్ వేసింది.  విచారణ జరపాలని  కమిషన్ నియమించింది. ఈ  కమిషన్ రద్దు చేయాలని కెసీఆర్ హైకోర్టు నాశ్రయించి భంగపడ్డారు. 
 తాజాగా  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, బీఆర్ఎస్ పార్టీకి మంత్రి సీతక్క శుక్రవారం లీగల్ నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారంటూ ఈ లీగల్ నోటీసులు ఇచ్చారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా వీడియో పెట్టారని ఆరోపించారు. తనపై చేసిన తప్పుడు ప్రచారానికి గాను లిఖితపూర్వకంగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. 
ఇందిరమ్మ రాజ్యం... ఇసుకరాళ్ల రాజ్యం పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారని పేర్కొన్నారు. జూన్ 24వ తేదీన బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియా పేజీలో ఈ పోస్టులు పెట్టారు. నిరాధార ఆరోపణలు చేశారని, ఇది సరికాదని ఆమె పేర్కొన్నారు. తమపై చేసిన ఆరోపణలకు గాను తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు