పేద, మధ్యతరగతి వారికి హెచ్చరిక!

ఇది పేద, మధ్య తరగతి జనానికి హెచ్చరిక. ఆ మాటకొస్తే ఓ మోస్తరు ధనవంతులు.. చిన్నసైజు కోటీశ్వరులకు కూడా హెచ్చరికే. ఇక్కడ పేర్కొన్న వర్గాలకు చెందిన వారు ఈ వారం పది రోజులపాటు రాజకీయ నాయకులకు సంబంధించిన అఫిడవిట్లను వివరాలను చూడటం మానేస్తే మంచిది. ఎందుకంటే, రాజకీయ నాయకుల నేరాల చిట్టా చూసి మనసు బాధపడుతుందని కాదు.. వాళ్ళకున్న ఆస్తులను చూసి గుండెలు అవిసిపోతాయి కాబట్టి. ముఖ్యంగా నెల జీతంతో జీవితాలను నెట్టుకొచ్చే వారి హృదయాలు ఎవరో పిడికిలితో పిండేసినట్టు తల్లడిల్లిపోతాయి కనుక.
దేశంలో చాలామంది జనం నెలకు 20 వేలు సంపాదించాలంటే అడ్డమైన గడ్డి కరవాల్సి వస్తోంది. అలాంటి రాజకీయ నాయకులకు ఈ ఆస్తులేంటండి బాబు.. గతంలో నాయకుల ఆస్తుల వివరాలు రెండు కోట్లు, మూడుకోట్లు అని చదివి అమ్మో అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడో... వందల కోట్లు, వేల కోట్లు.. పేర్లెందుగానీ, ఒక మనిషికి ఐదువేల కోట్లు, ఆరువేల కోట్లు ఆస్తుంలేంటండీ బాబు! కొంతమంది నాయకులు పెద్దలు సంపాదించిన వందలు, వేల కోట్లకు తాము సంపాదించిన మరిన్ని కోట్లు కలుపుతున్నారు. కొంతమంది సొంతగానే వేలకు వేల కోట్లు సంపాదిస్తున్నారు. స్థిరాస్తుల వివరాల్లో చూపించే అంకెలు కేవలం రిజిస్ట్రేషన్ వాల్యూ మాత్రమే. రిజిస్ట్రేషన్ వాల్యూతో లెక్కేస్తేనే అంతేసి వాల్యూ వుంటున్నాయంటే, ఆయా స్థిరాస్తుల అసలు విలువ ఎంత వుంటుందో ఊహించాలంటే భయం వేస్తుంది. 
ఈ వందలు, వేల కోట్ల ఆస్తుల గురించి చూసి ఇన్‌స్పిరేషన్ పొంది బడుగు జీవులు కూడా అన్ని కోట్లు సంపాదించే ఛాన్స్ సినిమాల్లో తప్ప నిజ జీవితంలో ఎలాగూ సాధ్యం కాదు. కాకపోతే ఆ ఆస్తులను చూసి మానసికంగా క్రుంగిపోవడం మాత్రం ఖాయం. అందరూ మనుషులమే కదా.. వాళ్ళకున్న ప్రత్యేకత ఏంటి? మనలో వున్న లోపం ఏంటి అని బాధపడి అల్లాడిపోవడం తథ్యం. అంచేత ఆ ఆస్తుల వివరాలను చూసి మనసు పాడు చేసుకోకుండా వుంటే మంచిది కదా!