ప్రజల ఆస్తులు గుటకాయస్వాహా.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బాధితుడు మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. అసలు స్వరూపం ఏమిటో మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ బట్టబయలు చేశారు. ఆ యాక్ట్ ను తీసుకువచ్చేసి.. ఇంకా అమలులోకి రాలేదు. పరిశీలనలో ఉంది అంటూ ఏపీ మంత్రులు చేస్తున్న ప్రకటనల డొల్ల తనాన్ని ఆయన ఒకే ఒక్క ట్వీట్ తో బయటపెట్టేశారు. తాను ప్రత్యక్ష బాధితుడిని అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు రాష్ట్రంలో దుమారం రేపుతోంది. జగన్ ప్రభుత్వ దొడ్డిదారి యవ్వారాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 

 ఆయన తన ట్వీట్ లో చెప్పిందేమిటంటే..  కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన ఆయన తల్లిదండ్రుల పట్టా భూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహశీల్దార్  ఆయన దరఖాస్తును తిరస్కరించారు. ఆర్డీవో పోస్ట్ ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి  వెనక్కు పంపేశారు. తన తల్లిదండ్రుల భూములపై తనకు ఏ హక్కూ లేకుండా చేస్తున్నారు. ఐఏఎస్‌ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌కు సేవలందించిన తన అధికారి పరిస్థితి ఇలా ఉంటే, సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేం అని పేర్కొన్నారు. 

వాస్తవానికి  ఏపీలో రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో కొత్త విధానాన్ని తీసుకువస్తున్నట్లు జగన్ సర్కార్ ప్రతిపాదించిన రోజునే ఆయన కన్ను ప్రైవేటు ఆస్తులపై పడిందన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అసలు జగన్ సర్కార్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ కాదేదీ తాకట్లునకు అనర్హం అన్న రీతిలోనే వ్యవహరించింది.  రాష్ట్ర ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అందిన కాడికి అప్పులు చేసింది. వివిధ కార్పొరేషన్ల పేరిట, బాండ్లను ష్యురీటీగా పెట్టి రకరకాల మార్గాల ద్వారా  అప్పలు చేసింది. మద్యంపై వచ్చే ఆదాయాన్ని కూడా తనఖా పెట్టి అప్పు తెచ్చింది. చివరికి దేవాలయాల భూములను కూడా తాకట్టు పెట్టేందుకు ప్రయత్నించింది కానీ కోర్టు మొట్టికాయలతో అది ఆగింది.  ఒక రాష్ట్రం తన పరిధికి చేయాల్సిన అప్పును ఏపీ ప్రభుత్వం ఎప్పుడో మించేసింది. ఇంకా అప్పులు కావాలని కేంద్రాన్ని కాళ్ళా వేళ్ళా పడి బ్రతిమాలాడుకుంటుంది. అందుకు కేంద్రం పెట్టే షరతులకు ఒప్పుకొని ప్రజా ప్రయోజనానికి కూడా గండికొట్టడానికి సైతం సిద్ధమైపోయింది. అయితే అలా చేసిన  అప్పులు సరిపోలేదేమో  ఇప్పుడు ఏకంగా ప్రజల ప్రైవేట్ ఆస్తులను కూడా జగన్ మోహన్ రెడ్డి సర్కార్  సొంతం చేసుకోవడానికి సిద్ధమైపోయింది.   ఇందుకు మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేష్ ఉదంతమే ఉదాహరణ. ఏకంగా పీఎంవో ఆఫీసులో పని చేసిన సీనియర్ మోస్ట్ అధికారి భూములకే రక్షణ లేకుండా పోయిందంటే.. ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతోంది.