స్థానికేతరులతో డబ్బుల పంపిణి! కుప్పంలో వైసీపీ అరాచకాలు.. 

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీలో పాగా వేసేందుకు అధికార పార్టీ చేయాల్సిన అన్ని కుట్రలు చేస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. నామినేషన్ల పర్వం నుంచే వైసీపీ నేతలు అక్రమాలు, దౌర్జన్యాలు వెలుగు చూడగా.. పోలింగ్ కు ముందు మరింతగా శృతిమించాయని అంటున్నారు. కుప్పంలో శనివారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. అయినా వైసీపీ నేతలు మాత్రం యథేచ్చగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. 

కుప్పం మున్సిపాలిటీ పరిధి పాతపేట మునిస్వామిపురంలో ఆదివారం ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. కుప్పంలో ఓటర్లకు స్థానికేతరులు డబ్బులు పంచుతున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తూ.. అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగి.. పలువురు గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు. 23వ వార్డులో నాన్ లోకల్‌కు సంబంధించిన వ్యక్తులు వైసీపీకి ప్రచారం చేస్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారు. మాజీ జెడ్పీటీసీ రాజ్ కుమార్,ఆయన తల్లి మాజీ ఎంపీటీసీపై స్థానికేతర వైసీపీ ప్రచార వ్యక్తులు దాడి చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.

కుప్పంలో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నా ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ఓటర్లకు డబ్బులు పంచడంలో అధికార పార్టీకి సహకరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా కుప్పంలో తమను ఓడించలేరని చెబుతున్నారు.