కుప్పం, హిందుపురం.. నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం జెండాయే!
posted on Jun 3, 2024 2:25PM
నాలుగు దశాబ్దాలుగా ఆ నియోజకవర్గాలలో తెలుగుదేశం వినా మరో జెండా ఎగిరిందే లేదు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ఆ రెండు నియోజకవర్గాలూ తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలుగానే ఉన్నాయి. ఆ నియోజకవర్గాలలో ఒకటి కుప్పం అయితే రెండోది హిందూపురం. ఈ నియోజకవర్గాలలో కాంగ్రెస్, వైసీపీ సహా ఏ ఇతర పార్టీ ఇప్పటి వరకూ విజయం సాధించిందే లేదు. ఔను 1983 నుంచి ఇఫ్పటి వరకూ తెలుగుదేశం తప్ప మరో పార్టీ గెలిచిన చరిత్ర లేదు.
ఈ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు మారితే మారారు కానీ, గెలిచిన పార్టీ మాత్రం తెలుగుదేశమే. ప్రత్యర్థి పార్టీలు సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని గెలుపు గుర్రాలుగా భావించిన అభ్యర్థులను బరిలోకి దింపినా.. ఫలితం మాత్రం తెలుగుదేశం విజయమే. ఆ నియోజకవర్గాలు ఏమిటో ఈ పాటికి మీకు అర్ధమైపోయే ఉంటుంది. ఔను కుప్పం, హిందూపురం నియోజకవర్గాలలో గత నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీదే విజయం. మరో పార్టీకి ఈ నియోజకవర్గాలలో స్థానమే లేదు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఈ రెండు నియోజకవర్గాల ప్రజలూ తమ మద్దతు విషయంలో అటూ ఇటూ చూడలేదు. తెలుగుదేశం తప్ప మరో పార్టీ వైపు మొగ్గు చూపింది లేదు.
కుప్పం నియోజకవర్గాన్ని తీసుకుంటే ఇక్కడ తెలుగుదేశం విజయాలు 1983 నుంచి ఆరంభమయ్యాయి. 1983 ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థి రంగస్వామి నాయుడు విజయం సాధించారు. 1985 ఎన్నికలలో కూడా ఆయనే తెలుగుదేశం అభ్యర్థిగా కుప్పం ని యోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి పరాజయం పాలైన చంద్రబాబు నాయుడు అప్పటి నుంచి కుప్పంపై దృష్టి సారించారు. 1989 ఎన్నికలలో కుప్పం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన చంద్రబాబు.. అప్పటి నుంచీ వరుసగా అదే నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తూ వస్తున్నారు. 1989 to 2019 ఆయన కుప్పం నుంచి ఓటమి అన్నదే ఎరుగకుండా విజేతగా నిలుస్తూ వచ్చారు. వ్యూహాత్మకంగా చంద్రగిరి నుంచి కుప్పంకు మారిన చంద్రబాబు మూడున్నర దశాబ్దాలుగా అక్కడి ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు. 2024 ఎన్నికలలో కూడా చంద్రబాబు కుప్పుం నుంచి ఘన విజయం సాధించడం ఖాయమని పోలింగ్ సరళిని బట్టి ఎవరైనా ఇట్టే చెప్పేయగలరు. ఇప్పటి వరకూ వరుసగా ఏడు సార్లు కుప్పం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన చంద్రబాబు. ఇప్పుడు ఎనిమిదో సారి కూడా విజయం సాధించనున్నారు.
ఇక హిందూపురం నియోజవకర్గానికి వస్తే.. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలిచింది. నిలుస్తూ వస్తోంది. ఈ నియోజకవర్గ ప్రజలు అభ్యర్థులు ఎవరన్నది కాకుండా వారు తెలుగుదేశం పార్టీకి చెందిన వారైతే చాలు గెలిపించేసుకుందాం అన్నట్లుగా ఉంటారు. అంతే కాకుండా నందమూరి కుటుంబానికి ఇక్కడ తిరుగులేని ప్రతిష్ట, ప్రజాభిమానం ఉంది. ఈ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు నందమూరి కుటుంబీకులే విజయం సాధించారు.
1983లో హిదూపురం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పామిశెట్టి రంగనాయకులు విజయం సాధించారు. ఆ తరువాత 1985, 1989లో తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత 1994 ఎన్నికలలో కూడా ఎన్టీఆర్ హిందూపురం నుంచి గెలిచి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసుకున్నారు. ఇక 2014 నుంచి హిందూపురం నుంచి నందమూరి తారకరామారావు వారసుడు నందమూరి బాలకృష్ణ ఇక్కడ నుంచి వరుస విజయాలు నమోదు చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికలలో విజయం సాధించిన బాలకృష్ణ, 2024 ఎన్నికలలో విజయం సాధించి తండ్రిలాగే తాను కూడా హిందూపురం నుంచి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేయడానికి రెడీగా ఉన్నారు.