ఔను ఫోన్ ట్యాపింగ్ నిజమే.. అయినా నాకు తెలియదు.. కేటీఆర్

చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఎంత బుకాయించినా నిజం నోటి వెంట తన్నుకు రాక తప్పదు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విషయంలోనూ అదే జరిగింది. ఫోన్ ట్యాపింగ్ నిజమేనంటూ కేటీఆర్ తన నోటి వెంటే చెప్పేశారు. వెంటనే నాలుక కరుచుకుని ఏమో నాకు తెలియదు అంటూ సర్దుకున్నారు. 

తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై విస్తృత చర్చ జరుగుతోంది. సస్పెండ్ అయిన ఎస్ఐబీ డీఎఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏ1గా ఉన్నారు. విచారణలో ఆయన వెల్లడించిన విషయాలను సంచలనం సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్ అగ్రనేతల ఆదేశాలతోనే తాను పలువురు రాజకీయనాయకుల ఫోన్లు ట్యాప్ చేశానని ప్రణీత్ రావు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. కేవలం రాజకీయ నాయకుల ఫోన్లే కాకుండా, సినీ హీరోయిన్లు, బడా వ్యాపారవేత్తల ఫోన్లు కూడా ట్యాప్ చేశారనీ, దీనినో దందాగా మార్చి వేల కోట్లు దండుకున్నారనీ కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఇప్పటి వరకూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలెవరూ నోరెత్తలేదు. అయితే తాజాగా కేటీఆర్ మాత్రం ఫోన్ ట్యాపింగ్ నిజమేనంటూ ఒప్పుకున్నారు. బుధవారం (మార్చి 27)మల్కాజ్ గిరి  పార్లమెంటరీ సమావేశంలో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాట్లాడారు.

ఔను కొన్ని ఫోన్ కాల్స్ ట్యాప్ అయి ఉంటాయి అని అంగీకరించారు. అయితే వెంటనే సర్దుకుని ఆ విషయం తనకు తెలియదని చెప్పుకునే ప్రయత్నం చేశారు. అక్కడితో ఆగకుండా క్రిమినల్స్ ఫోన్లు ట్యాప్ చేస్తే మాత్రం తప్పేమిటని ప్రశ్నించారు. అధికార కాంగ్రెస్ ఈ విషయాన్ని ఏదో అంతర్జాతీయ కుంభకోణంగా చూపేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు.

అయినా క్రిమినల్స్ ఫోన్లు ట్యాప్ చేయడం పోలీసుల బాధ్యత కాదా అని ప్రశ్నించారు. అయితే కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ నిజమేనంటూ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ జరిగిందనీ, దాని వెనుక బీఆర్ఎస్ హస్తం ఉందని కేటీఆర్ పరోక్షంగా అంగీకరించినట్లైందని పరిశీలకులు చెబుతున్నారు.