మంచివాడు మా రేవంత్!

పదిహేను నెలల నిరీక్షణ అనంతరం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కబోతోందన్న టాక్ వినిపిస్తోంది.  శాసనసభలో, లాబీల్లోనూ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని పలు వురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి అభినందనలు తెలుపుతున్నారు. శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన హామీతో రాజగోపాల్‌రెడ్డి తిరిగి సొంత పార్టీకి చేరుకున్నారు. మునుగోడు నుంచి ఆయన విజయం సాధించడంతో పాటు భువనగిరి ఎంపీగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపించుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అప్పగించిన బాధ్యతను పక్కాగా నిర్వర్తిం చారు. దీంతో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా మంత్రి పదవి ఖాయమన్న భరోసా రాజగోపాల్‌రెడ్డి వర్గీయుల్లో ఉంది.  కేబినెట్‌ విస్తరణకు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో తనకు అధిష్టానం ఏ పదవి అప్పగించినా బాధ్యతతో నిర్వహిస్తానని రాజగోపాల్‌రెడ్డి అంటున్నారు. అయితే ఆయన అనుచరులు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఆయన అభిమానులు మాత్రం రాజగోపాల్‌రెడ్డి  హోంమంత్రిగా బాధ్య తలు అప్పగిస్తే బాగుంటుందని పేర్కొంటున్నారు.

ఆ క్రమంలో పీసీసీ పదవిని రేవంత్ రెడ్డి రూ. 50 కోట్లకు కొన్నాడని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మంచోడు కాబట్టే మీరు ఫామ్ హౌస్ లో ప్రశాంతంగా ఉన్నారనీ, లేకపోతే నిన్నటి నుంచి ఒక లెక్క, ఈరోజు నుంచి మరో లెక్క అన్నట్టుగా ఉండేదని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు ఆర్ అండ్ బీ మినిస్టర్‌గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన శాఖ మార్చాలని కోరుతున్నారట. ఈ నేపధ్యంలో అన్నదమ్ములిద్దరు రేవంత్‌కు మద్దతుగా గొంతెత్తుడటం ఇంట్రస్టింగ్‌గా తయారైంది.