జగన్ తానా అన్నా.. తందానా అనని నాని, వంశీ!

వైసీపీలో జగన్ ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటించే వారు, జగన్ చూసి రమ్మంటే కాల్చి వచ్చేంతటి వీరభక్త హనుమాన్ లలో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముందు వరుసలో ఉంటారు. అయితే పార్టీ ఓటమి తరువాత వారిద్దరూ కూడా జగన్ మాటకు పూచికపుల్ల పాటి విలువ కూడా ఇవ్వడం లేదని తాజాగా తేటతెల్లమైంది. 

అసలే తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం విషయంలో జగన్ నిండా మునిగిపోయారు. ఈ వివాదం నుంచి బయటపడటమెలాగో తెలియక గిలగిలా కొట్టుకుంటున్నారు. అలవాటైన డైవర్షన్ పాలిటిక్స్ తో ఈ వివాదం నుంచి బయటపడదామని ఆయన చేస్తున్న ప్రయత్నాలు బూమరాంగ్ అవుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో పార్టీలోని కీలక నేతల నుంచి ఎదురౌతున్న ధిక్కారం ఆయనను మరింత కుంగ దీస్తున్నది. ఎలాగోలా లడ్డూ వివాదం నుంచి బయటపడటానికి ఆయన ప్రాయశ్చిత పూజలు అంటూ పార్టీ నేతలు శ్రేణులకు పిలుపు నిచ్చారు. ఈ దీక్షను తాను ముందుండి నిర్వహస్తానని ప్రకటించిన జగన్ తిరుమల వెంకటేశ్వరుడిపై విశ్వాసం ఉంది అంటూ డిక్లరేషన్ ఇవ్వడానికి ఇష్టం లేక ఏకంగా తన తిరుమల యాత్రనే రద్దు చేసుకున్నారు. నాయకుడే జారిపోయే సరికి ఆయన ఆదేశాలను పాటించే విషయంలో పార్టీ నేతలు కూడా లైట్ తీసుకున్నారు. అలా లైట్ తీసుకున్న వారిలో జగన్ వీర భక్త హనుమాన్ లుగా పేరు గాంచిన కొడాలి నాని, వల్లభనేని వంశీ కూడా ఉండటం గమనార్హం.  

జగన్ తిరుమల యాత్ర రద్దు అయినా.. ఆయన  పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు, శ్రేణులు ఆలయాల్లో ప్రాయశ్చిత పూజలు చేయాలన్న నిర్ణయంలో మాత్రం ఎలాంటి మార్పూ లేదని జగన్ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వైసీపీ నేతలు, శ్రేణులు తూతూ మంత్రంగా ప్రాయశ్చిత దీక్షలు చేశారు. కానీ జగన్ ఆదేశాలను కొడాలి నాని, వల్లభనేని వంశీ బేఖాతరు చేశారు. కనీసం పట్టించుకోలేదు. జగన్ అధికారంలో ఉన్న సమయంలో ఆయన మొప్పు కోసం బూతులు, దాడులు, దౌర్జన్యాలతో రెచ్చిపోయిన వీరిరువురూ ఎన్నికలలో పార్టీ ఓటమి తరువాత చేసిన తప్పులకు ప్రాయశ్చితం ఇదే అనుకున్నారో ఏమో పూర్తిగా మౌనం వహించారు.  ఎంతో అత్యవసరమైతే తప్ప ఆంధ్రప్రదేశ్ పొలిమేరల్లోకి కూడా రావడానికి సాహసించడం లేదు. ఈ తరుణంలో తాజాగా తాడేపల్లిలో జగన్ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ రివ్యూ మీటింగ్ కు వీరిరువురూ హాజరయ్యారు. ఆ సమావేశం తరువాత కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లో మునుపటి ఫైర్ లేదు. ధీమా లేదు. మీడియా ముందుకు వచ్చాను కనుక తెలుగుదేశం, చంద్రబాబుపై విమర్శలు చేయాలి కనుక చేస్తున్నా అన్నట్లుగా మాట్లాడి మమ అనిపించారు.

వల్లభనేని వంశీ అయితే మీడియా ముందు నోరెత్తే ధైర్యం కూడా చేయలేదు. ఇలా వచ్చారు.. అలా వెళ్లారు అన్నట్లుగా తాడేపల్లి నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. కనీసం తమ నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఓటమి తరువాత కొడాలి నాని, వల్లభనేని వంశీ తీరుతో వారి వారి నియోజకవర్గాలలో వైసీపీ కార్యకర్తలు తీవ్ర నిరుత్సాహంలో కూరుకుపోయారు. ఇప్పుడు జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షలకు డుమ్మా కొట్టడం ద్వారా వారు జగన్ మాటకు పూచికపుల్ల విలువ కూడా ఇవ్వడం లేదని తేటతెల్లమైపోయింది.