హరీష్ కు ఉచ్చు బిగుస్తోందా? ఈటల సీన్ రిపీట్ కానుందా?
posted on Jul 8, 2021 11:24AM
ఉద్యమకాలం నుంచి తెరాసలో కీలక పాత్రను పోషించిన నాయకులు చాలామందే ఉన్నారు. గాదె ఇన్నయ్య మొదలు అనేక మంది ఉద్యమాన్ని నిలబెట్టడంలో, ముందుకు తీసుకు పోవడంలో కీలక భూమికను పోషించారు. అయితే, ఆందరూ ఒకెత్తు అయితే, కేసీఆర్’కు కుడి ఎడమ భుజాలుగా నిలిచిన ఈటల రాజేందర్, హరీష్ రావు ఒకెత్తు. ఉద్యమ పార్టీగా అవతరించిన తెరాస రాజకీయ పార్టీ అవతారం మార్చి, ఆ తర్వాత కుటుంబ పార్టీ అవతారం ఎత్తిన తర్వాత, ముఖ్యంగా రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితిలోమార్పు మొదలైంది. ప్రాధాన్యతలు మారుతూ వచ్చాయి. కుడి ఎడమ భుజాలు రెండూ భారంగా మారాయి. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన అరగంటలోనే ఈటల రాజేందర్ అక్రమాల కథనం తెరపైకి వచ్చింది . గంటల్లో విచారణకు ఆదేశాలు వెళ్ళాయి. మరో 24 గంటలు తిరక్కుండానే, విచారణ పూర్తయి నివేదిక సిద్దమైంది. అంతే మరో మాటకు ఆస్కారం లేకుండా ఆయన మీద వేటు పడింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన్ని మంత్రి వర్గం నుంఛి బర్తరఫ్ చేసి ఒక భుజం భారాన్ని తగ్గించుకున్నారు. ఆ తర్వాత ఏమి జరిగింది, ఏమి జరుగుతోంది అనేది అందరు చూస్తున్నదే.
ఇక కేసీఆర్ రెండవ భుజం సంగతేంటి?.. ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఈటలను పంపించిన విధాగానే, హరీష్’కు ఉద్వాసన తప్పదని చాలా మంది భావించారు.ఇప్పటికీ భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే, తెరాస రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, అంతవరకు ట్రబుల్ షూటర్’గా పేరున్న హరీష్ రావుకే ట్రబుల్స్ స్టార్ట్ అయ్యాయి. రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆయన్ని మంత్రి వర్గంలోకే తీసుకోలేదు. అనంత కోటి లింగాల్లో ఒకడిగా మిగిలి పోయారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో కారు పదహారు బోల్తా కొట్టడంతో కేసీఆర్’కు తత్త్వం బోధపడిందో, ఇంకేమైనా జరిగిందో కానీ, హరీష్’ను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మంత్రి వర్గంలోకి అయితే తీసుకున్నారు, కానీ, ప్లానింగ్ లేని ఫైనాన్సు ఇచ్చి సిద్దిపేటకు పరిమితం చేశారు. ఆర్థిక మంత్రి లేకుందానే, ఆ శాఖకు సంబందించిన విషయాలపై సమీక్షలు, నిర్ణయాలు జరిగిపోయాయనే వార్తలు వచ్చాయి.
హరీష్’ను పక్కన పెట్టినప్పుడు ప్రజల్లో ఆయన పట్ల సానుభూతి పెరిగిందని అంటారు. ఆయన తనకు జరిగిన అవమానాలను మౌనంగా భరించారని అంటారు. ఎవరో కాదు సహా బాదితుడు ఈటల, హరీష్ అవమానంతో ఏడ్చారని న్నారు. సరే ఆ మాటలను హరీష్ ఖండించారు అనుకోండి అది వేరే విషయం. అదెలా ఉన్నా అవమానాలు కూడా ఆయనకు ఒక విధంగా మేలే చేశాయి. ఆయన మౌన వేదన ఆయన ఇమేజిని పెంచింది. ఆయన మౌనంగా ఉన్నా, ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, కొద్దిమంది మత్రులతో సహా ఆయన అభిమానులలో, కేసీఆర్ పట్ల ఆగ్రహం వ్యక్తమైంది. ఆ ఆగ్రహం నాయకులలో బహిరంగంగ వ్యక్తం కాకపోయినా, ప్రజలు, కార్యకర్తల్లో భగ్గుమన్న సందర్భాలు లేక పోలేదు.
ఈటల ఎపిసోడ్ తర్వాత హరీష్ రావులో వచ్చిన మార్పు, ఆయన ఇమేజ్’ని తెబ్బతీసిందని పార్టీలోని ఆయన అనుచరులే అంగీకరిస్తున్నారు. ఈటల విషయంలో హరీష్ రావు యూ టూ బ్రూటస్ తరహాలో వ్యవహరించారని, తమ పదవిని కాపాడుకోవడం కోసం ఈటలను వదిలేశారన్నఅభియోగం వినవస్తోంది. దీనికి తోడు గతంలోనే కేటీఆర్ ముఖ్యమంత్రి అయినా తనకు అభ్యంతరం లేదని.. ఆయన కేబినెట్ లో కూడా మంత్రిగా పనిచేయడానికి సిద్ధమని ప్రకటించడంతో ఇంకా చులకన భావన ఏర్పడిందని చెబుతున్నారు. ఈటల ఎపిసోడ్ తర్వాత కేసీఆర్’ కు హరీష్ అవసరం వచ్చింది, కాబట్టి మళ్ళీ ఆయన్ని దగ్గరకు తీశారు. కేటీఆర్ కంటే, ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెట్టారు. వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతను కూడా పరోక్షంగా హరీష్ కే అప్పచెప్పారు. ఒకటి రెండు కేబినెట్ సబ్ కమిటీలతోపాటు హుజూరాబాద్ ఉప ఎన్నిక బాధ్యతను కూడా హరీష్ భుజాల మీద పెట్టారు. అయితే,హరీష్’ను దగ్గరకు తీస్తోంది, ఆయన్ను కొండ మెట్లు ఎక్కిస్తోంది, అదను చూసి దెబ్బతీసేందుకే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి, ఇప్పటికీ హరీష్ పని హరీష్ చేస్తుంటే, కేసీఆర్ పని కేసీఆర్ చేస్తున్నారని,హరీష్’ను నిఘా నేత్రం వెంటాడుతోందని, పార్టీ శ్రేణులు గుసగుసలు పోతున్నాయి. ఈ నేపధ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన అరగంటలో ... ఈటల ఉద్వాసన ముందు సీన్లు ..రిపీట్ అవుతాయా? అన్న అనుమానాలు కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
కేసీఆర్ కు ఒక్కసారి అనుమానం వస్తే అంత ఈజీగా నమ్మరని పార్టీ శ్రేణుల సమాచారం. కాకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో దగ్గరకు తీసుకొని బాధ్యతలు ఇచ్చినా.. ఓ కన్నేసి ఉంచుతారని అంటున్నారు. ఇప్పుడు హరీష్ మీద ఒకటి కాదు డిఫరెంట్ యాంగిల్స్’లో నిఘానేత్రాలు పనిచేస్తున్నాయని సమాచారం.అంతే కాకుండా ఇప్పటికే హరీష్ రావు వేలుతోనే ఆయన కంట్లో పోడుచుకునేలా చేసి, ఆయన ఇమేజ్’ని గణనీయంగా దెబ్బ తీసిన కేసీఆర్, హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత ఫలితాలు వచ్చే వరకు కూడా అగకపోవచ్చని, హరీష్’ను పంపి కేటీఆర్ పట్టాభిషేకం జరిపించేసినా ఆశ్చర్య పోనవసరం లేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే అదే సమయంలో హరీష్ ను తక్కువగా అంచనా వేయలేమనే మాట కూడా వినిపిస్తున్నా,కానీ, ఇమేజ్ దెబ్బతిన్న నేపధ్యంలో ట్రబుల్ షూటర్ సైతం చేతులెత్తేయడం మినహా చేయగలిగింది ఏమీ ఉండదని అంటున్నారు.