కేసీఆర్ తో రైతు ఉద్యమ నేత రాకేశ్ తితాయత్ రహస్య భేటీ..? ఆంతర్యమేమిటి?
posted on Jul 8, 2022 6:21PM
కేసీఆర్ వ్యూహాలేమిటి? ప్రగతి భవన్ లేదా ఫామ్ హౌస్ దాటి బయటకు రాకుండా ఆయనేం చేస్తున్నారు? టీఆర్ఎస్ శ్రేణుల్లోనే ఈ సందేహాలు వ్యక్తమౌతున్నాయి. అయితే ఆయన తన జాతీయ రాజకీయ ప్రవేశంపై వ్యూహాలకు పదును పెడుతున్నారనీ, ఎన్ని అవాంతరాలెదురైనా, ఎదురు దెబ్బలు తగిలినా ముందుకే అడుగేయాలన్న కృత నిశ్చయంతో ఉన్నారనీ ఆయనను సన్నిహితంగా ఎరిగిన వాళ్లు చెబుతుంటారు. ఇటు రాష్ట్రంలోనూ టీఆర్ఎస్ ప్రభ మసకబారుతోంది. అటు జాతీయ స్థాయిలోనూ కేసీఆర్ రాకను స్వాగతించే వారెవరూ కనిపించడం లేదు. అయినా కూడా కేసీఆర్ నోరు మెదపడం లేదు. మరేం చేస్తున్నారు. ఈ ప్రశ్నకు సంపూర్ణంగా కాకున్నా.. ఏదో ఒక మేరకు బదులు అనిపించే ఉదంతం ఒకటి గురువారం సంభవించింది. మోడీ తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను నిరసనగా సుదీర్ఘ రైతు ఉద్యమానికి నాయకత్వం వహించిన రైతు ఉద్యమ నేత రాకేష్ తికాయత్, ఆయన అనుచరుడు యుధ్వీర్ సింగ్ లో కలిసి గురువారం సాయంత్రం కేసీఆర్ తో భేటీ అయ్యారు. శంషాబాద్ విమానాశ్రంయలో దిగిన వీరిరువురూ అక్కడ నుంచి నేరుగా ప్రగతి భవన్ చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆరే వీరిని స్వయంగా పిలిపించినట్లు విశ్వసనీయ సమాచారం. దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ భేటీ వివరాలను అత్యంత గోప్యంగా ఉంచారు. భేటీ అనంతరం వీరు ఇరువురూ సీఎం క్యాంప్ ఆపీసులోనే బస చేశారు.ఇంతకీ రెండున్నర గంటల పాటు అత్యంత రహస్యంగా జరిగిన భేటీలో ఏం చర్చించారు? ఆ వివరాలు, అసలు భేటీ వివరాలూ బయటకు రాకుండా ఎందుకు ఇంత గోప్యత పాటిస్తున్నారన్నది పరిశీలకులకు కూడా అంతుబట్టడం లేదంటున్నారు. ప్రగతి భవన్ వర్గాల నుంచి అత్యంత విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఈ భేటీలో రైతు సమస్యలపై రైతులతో చైతన్యం తీసుకురావడం, గతంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమలో అనుసరించిన పంథా, రైతులను మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఏకం చేయడం ఎలా అన్న విషయాలపై వీరి మధ్య విస్తృతంగా చర్చ జరిగినట్లు చెబుతున్నారు. మొత్తంగా మోడీకి వ్యతిరేకంగా ఇతర రాజకీయ శక్తులు కలిసి రాకున్నా రైతులను చైతన్య వంతులను చేసి వారిని ఉద్యమోన్ముఖులను చేసి వారికి నాయకత్వం వహించేలా కేసీఆర్ వ్యూహాలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రైతు ఉద్యమ నేత రాకేశ్ తికాయత్, యుధ్వీర్ సింగ్ లను పిలిపించుకుని మరీ కేసీఆర్ వారితో రహస్యంగా భేటీ అయ్యారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా శుక్రవారం సాయంత్రం కూడా కేసీఆర్ తో వీరిరువురూ మరోసారి భేటీ అయినట్లు సమాచారం.