కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శి హఠాన్మరణం
posted on Jun 18, 2014 11:20AM

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న డాక్టర్ పెండ్యాల సంతోష్‌కుమార్ (57) గుండెపోటు కారణంగా హఠాత్తుగా మరణించారు. ఆయన ఒక వారం రోజుల క్రితమే కేసీఆర్ దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని నాగోలు ప్రాంతంలో గల అలకాపురి కాలనీలోని ఆయన నివాసంలో గుండెపోటు కారణంగా మంగళవారం అర్ధరాత్రి ఆయన మరణించారు. సంతోష్ కుమార్ స్వస్థలం కరీంనగర్. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు వున్నారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పొందిన ఆయన అనేక ప్రభుత్వ సంస్థలలో వివిధ హోదాల్లో పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ముఖ్యమంత్రికి వ్యక్తిగత కార్యదర్శిగా వుండే మంచి అవకాశాన్ని పొందిన ఆనందం వారం రోజులు కూడా మిగల్లేదు. సంతోష్ కుమార్ భౌతిక కాయాన్ని పలువురు టీఆర్ఎస్ నాయకులు సందర్శించి సంతాపం, ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.