కేసీఆర్ కే అంతు చిక్కని కాంగ్రెస్ రాజకీయాలు!

రాజకీయాలలో అపర చాణిక్యుడిగా పేరు తెచ్చుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఆయన రాజకీయ చతురత ఏంటో పెద్దగా ఎవరికీ తెలియదు కానీ.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారం దక్కించుకున్న అనంతరం ఆయన ఏమిటో, ఆయన చాణక్యం ఏమిటో అందరికీ అంతుబట్టింది. తెలంగాణ మూలలోకి వెళ్లి వారిని పలకరించేలా మాట్లాడే ఆయన మాటలు, ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు ఆయన  రచించే ప్రణాళికలు ఇలా ఒక్కొక్కటీ బయటకొచ్చే కొద్దీ ఆయన రాజకీయం ఏంటో అందరికీ అవగతమైంది. గిట్టని వాళ్ళు, ప్రతిపక్షాలు ఆయన మీద ఎన్ని విమర్శలు చేసినా.. ఆయన ఒక్కసారి మైకు అందుకుంటే వాటన్నిటికీ తనదైన శైలిలో మూడే ముక్కలలో సమాధానం చెప్పగల నేర్పరి ఆయన. అయితే, వ్యూహాలకు ప్రతి వ్యూహాలు పన్నడంలో దిట్టగా.. రాజకీయ దురంధ‌రుడిగా పేరున్న ఆయనకే అర్ధం కాకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రాజకీయం చేస్తుందా అనిపిస్తుంది.

 తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చకచకా రాజకీయాలను చక్కబెట్టే పనిలో ఉంది. నిన్న మొన్నటి వరకు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉంటూ వచ్చిన వాళ్ళు ఇప్పుడు కలిసి కట్టుగా నేతలను లాగేసుకొనే పనిలో ఉన్నారు. అంతర్గత కుమ్మలాటలను కాసేపు పక్కన పెట్టేసి అధికార పార్టీని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించే పనిలో పడ్డారు.

అసలు  వీరి కలయిన సాధ్యమయ్యే పనేనా అన్నట్లుగా భావించిన తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా చేయి చేయి కలిపి వెళ్లి పార్టీలోకి రావాల్సిందిగా ఇతర పార్టీల నేతలకు సాదర స్వాగతాలు పలుకుతున్నారు. ఎవరినైతే కేసీఆర్ కాదనుకున్నారో వాళ్లందరినీ పోగుచేసి గులాబీ బాస్ కి చుక్కలు చూపించే పనిని మూకుమ్మడిగా నెత్తికి ఎత్తుకుంటున్నారు. అసలు వీళ్ళకి ఉన్న ఈగోకి వీళ్ళేం చేస్తార్లే అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఒకటికి వంద మెట్లు దిగి మీరు వస్తే చాలు మీదే రాజ్యం అన్నట్లు అసలైన రాజకీయాన్ని అవలంబిస్తున్నారు.దీంతో ఇప్పుడు గులాబీ బాస్ కి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి కనిపిస్తున్నది.

 పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూప‌ల్లి కృష్ణారావు, నాగం జ‌నార్ద‌న్‌రెడ్డి వంటి వారికి కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మ‌కంగా గాలం వేసి పట్టేసింది. హస్తం నీడకి వీరు చేరడం ఇక లాంఛనప్రాయమే. వీరిని ఇప్పటికే బీఆర్ఎస్ ముప్పుతిప్పలు పెట్టిసి వదిలేసింది. దీంతో వీరు తమ వర్గాన్ని కూడగట్టుకొని మరింత బలంగా మారి ఇప్పుడు సీన్ లోకి ఎంటర్ అయ్యారు. ఒకప్పుడు రాజకీయ ఉద్దండులైన వీరిని బీఆర్ఎస్ లైట్ తీసుకోవడంతో వీరు అసంతృప్త వర్గాన్ని మోపుజేసి ఒక జట్టుగా చేసి పెట్టుకున్నారు. దీంతో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ ముందు వీళ్ళని ఎలాగైనా పట్టేస్తే.. మిగిలిన పని సులభంగా చక్కపెట్టేయొచ్చని కాళ్లకు బలపం కట్టుకొని వీళ్ళ కోసం వీర ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి వీళ్ళు కాంగ్రెస్ కండువా కప్పుకుంటే బీఆర్ఎస్ పార్టీకి ఇక కౌంట్ డౌన్ మొదలైనట్లేనని భావిస్తున్నారు.

ఇప్పటికే సొంత పార్టీలో పనితీరులో అట్టడుగులో ఉన్న ఎమ్మెల్యేల జాబితా విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న కేసీఆర్ కు.. వాళ్ళలో రెబల్స్ అయ్యే వారిని ఎలా బుజ్జగించాలో అర్ధం కాని పరిస్థితిలో ఉండగా.. కాంగ్రెస్ వాళ్ళకి కూడా గాలమేసి ఉసిగొల్పితే జరిగే నష్టం లెక్క వేయలేనిది. మరోవైపు వైఎస్ షర్మిలను కూడా రంగంలోకి దింపేందుకు శక్తిమేరా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. మరోవైపు టీడీపీ ఎవరితో పొత్తుకు వెళ్తుందో ఇంకా స్పష్టత రాలేదు. ఇటు షర్మిల, అటు టీడీపీ అంశం కూడా క్లారిటీ వస్తే అన్ని వైపులా బీఆర్ఎస్ పార్టీకి ఉచ్చు బిగిసి అష్టదిగ్బంధనంగా మారుతుంది. అయితే, ఎలాంటి చిక్కుముడినైనా చాకచక్యంగా విప్పగల నేర్పరిగా పేరున్న కేసీఆర్ ఈ పొలిటిల్ రైడ్ ను ఎలా గమ్యానికి చేరుస్తారో చూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu