కేసీఆర్ తెలంగాణా బందుకు పిలుపునీయడం సమర్ధనీయమేనా?
posted on May 28, 2014 6:37PM
.jpg)
పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ లో కలుపుతూ మోడీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడాన్ని నిరసిస్తూ కేసీఆర్ రేపు తెలంగాణా బందుకు పిలుపునిచ్చారు. కేసీఆర్ తమ పార్టీ ఎన్నికలలో గెలిచిన తరువాత కూడా ఏదో ఒక సాకుతో సీమాంధ్రులతో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉన్నారు తప్ప ఏనాడు కూడా సామరస్యంగా వ్యవహరించలేదు. అయినప్పటికీ చంద్రబాబు చొరవ చూపుతూ తాను ఆయనతో కలిసి పనిచేసేందుకు సిద్దమని ప్రకటించారు. ఇరువురూ కూర్చొని సమస్యలను చర్చించుకొని సామరస్య ధోరణిలో పరిష్కరించుకొందామని స్నేహహస్తం అందించినప్పటికీ, దానికి కేసీఆర్ నుండి కనీస స్పందన లేదు.
కానీ కేంద్రం పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రాలో కలుపబోతోందనే సంగతి రూడీ అయిన తరువాత, ఈ సమస్య గురించి ఇరువురు ముఖమంత్రులు చర్చించుకొని పరిష్కారం కనుగొనవలసి ఉందని, అందువల్ల మోడీ ప్రభుత్వం ఇరువురు ముఖ్యమంత్రులతో చర్చించిన తరువాతనే నిర్ణయం తీసుకోవాలని వాదిస్తున్నారు. ఇదే విజ్ఞత ఆయన మొదటే కనబరిచి చంద్రబాబుతో చర్చలు మొదలు పెట్టి ఉండి ఉంటే, బహుశః ఈ రోజు పరిస్థితి వేరేలా ఉండేదేమో? తద్వారా వారిరువురి మధ్య ఒక సానుకూల వాతావరణం కూడా ఏర్పడే అవకాశం ఉండేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చెప్పట్టబోతున్న కేసీఆర్, రేపు తెలంగాణా బంద్ కు పిలుపునీయడం ద్వారా, రానున్న ఐదేళ్ళలో తన పాలన ఏవిధంగా ఉండబోతోందో తెలంగాణా ప్రజలకు అప్పుడే రుచి చూపిస్తున్నట్లున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఈవిధంగా బందులు, సమ్మెలకు పిలుపునిస్తుంటే, ఇప్పటికే ఉద్యమాలతో ఘోరంగా దెబ్బ తిన్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత దెబ్బ తినడం ఖాయం. ఇటువంటి వాతావరణంలో కొత్తగా పరిశ్రమలు, సాఫ్ట్ వేర్ సంస్థలు ముందుకు రావడానికి వెనుకాడవచ్చును. ప్రస్తుతం ఉన్నవి ఇరుగుపొరుగు రాష్ట్రాలకు తరలిపోయినా ఆశ్చర్యం లేదు. తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాదును కాపాడుకోవాలంటే, కేసీఆర్ ఇటువంటి యుద్దవాతావరణం సృష్టించే ఆలోచనలు విరమించుకోవడం చాలా అవసరమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.