ఔను.. వాళ్లిద్ద‌రూ మాట్లాడుకున్నారు !

 కొన్ని వూహించ‌ని సంఘ‌ట‌న‌లు రాజ‌కీయాల్లో జ‌రుగుతూంటాయి.  ఆ త‌ర్వాత వాటిక‌వే  స‌ద్దుమ‌ణుగు తాయి.  గ‌త తొమ్మిది నెల‌లుగా  రాజ్‌భ‌వ‌న్‌కు, ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు మ‌ధ్య దూరం బాగా పెరిగింది. కానీ ఇన్నా ళ్ల‌కి  ఆ దూరం ఒకింత త‌గ్గింద‌నే అనుకోవాలి.  తెలంగాణా గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై  రాష్ట్ర హైకోర్టు కొత్త ప్రధాన న్యాయ మూర్తి జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్ చేత ప్ర‌మాణ స్వీ కారం చేయించారు. దీనికి రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ హాజ‌ర య్యారు. తొమ్మిది నెల‌లుగా రాజ్‌భ‌వ‌న్ కు దూరంగా వుంటున్న కేసీఆర్ బుధ‌వారం ఆ  కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ప్రొటోకాల్ ప్రకారం సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలి కనుక హాజరయ్యారు. అయితే ఆ సందర్బంగా గవర్నర్ తమిళిసైతో కొద్ది సేపు మాట్లాడటమే అందర్నీ ఆశ్చర్య పరిచింది.

చాలాకాలం నుంచే అటు కేంద్రం నుంచి ఎలాంటి మ‌ద్ద‌తు లేద‌ని భారీ ఆరోపణ‌ల‌తో తెలంగాణా ప్రభు త్వం మోదీ స‌ర్కార్ మీద  ఒంటి కాలి మీద లేస్తోంది. కేంద్రం ప్ర‌చారం చేసుకుంటున్న స్థాయిలో రాష్ట్రా నికి ఎటువంటి స‌హా యం అంద‌లేద‌న్న‌ది టీఆర్ ఎస్ ఆరోప‌ణ‌. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై కూడా  బిజెపి ప్ర‌తి నిధిలానే వ్య‌వ‌హరిస్తు న్నార‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తూ క్ర‌మేపీ రాజ్‌భ‌వ‌న్‌ను తెరాస పూర్తిగా విస్మ‌రించిం ది. రాష్ట్రంలో పాల‌న దుర్భ‌రంగా వుంద‌ని, త్వ‌ర‌లో ఇక్క‌డ కేసీఆర్ కుటుంబ పాల‌న‌కు తెర దించుతామ ని బిజెపి నాయ‌కులు ప్ర‌తీ వేదిక మీదా హోరెత్తిస్తున్నారు. ఒకింత నర్మగర్భంగానైనా గవర్నర్ తమిళిసై కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలపై కొన్ని వ్యాఖ్యలు చేశారు.  

చాలారోజులుగా కేంద్రం నుంచి రాష్ట్రానికి  క‌మ‌ల‌నాథులు ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చి రాష్ట్ర ప్రభుత్వ విధానాల‌ను ఘాటుగా విమ‌ర్శిస్తూ ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ పొంద‌డానికి శాయ‌శ‌క్తులా శ్ర‌మి స్తున్నారు. కానీ వారంతా కేవ‌లం టూరిస్టులేన‌ని వాస్త‌వానికి  తెలంగాణా ప్ర‌జ‌ల‌కు వీస‌మెత్తు న్యాయం చేయ‌లేదని టిఆర్ ఎస్ ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌కుండా ఎదురు దాడి చేస్తోంది.  గతంలో టీఆర్ఎస్ పంపించిన కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ  ప్రతిపాద నను గవర్నర్ తిరస్కరించారు.

ఈ ఉదంతమే గవర్నర్ కు, కేసీఆర్ కు మధ్య దూరానికి దారి తీసింది. అనంతరం రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ పాఠంలో   రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పాటు కేంద్ర పథకాలను కూడా హైలెట్  చేస్తూ గవర్నర్ తమిళ సై ప్రసంగించడం   అగ్నికి ఆజ్యం పోసినట్టైంది. ఆ తరువాత గవర్నర్ ప్రసంగం లేకుండా నే బడ్జెట్‌ను ప్రవేశపెట్ట డం వంటి నిర్ణయాలు సీఎం, గవర్నర్‌ల మధ్య మరింత దూరం పెంచాయి. అయితే తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఆ దూరాన్ని ఒకింత తగ్గించిందన్న భావన వ్యక్తమౌతున్నది.

మొత్తానికి తొమ్మిది  నెలల తర్వాత కేసీఆర్ రాజ్‌భవన్ మెట్లెక్కారు. కేసీఆర్‌, గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై  ఇద్దరూ పక్క పక్కనే ఆసీనులైనప్పటికీ,  తొలుత వారిరువురూ  ఎడ మొహం పెడ మొహంగానే కనిపిం చారు. కేసీఆర్ ను తమిళిసై పలకరించారు. కానీ కేసీఆర్ చూసీచూడనట్టుగా వ్యవహరించారు. కేసీఆర్ వ్యవహార శైలితో గవ ర్నర్ సైతం మౌనంగా ఉండాల్సి వచ్చింది. అనంతరం అల్పాహారం సమయంలో మాత్రం ఇద్దరూ ఆత్మీ యంగా పలకరించుకున్నట్టే కనిపించింది. మొత్తానికి అల్పాహార సమయంలో గవర్నర్ ను ఆత్మీయంగా పలకరించి  రాజ్‌భవన్‌కు, ప్రగతి భవన్‌కు మధ్య దూరాన్ని కేసీఆర్  కాస్త తగ్గించారు.