ఢిల్లీ లిక్కర్ స్కాం.. కవిత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు?.. చార్జిషీట్ లో పేరు
posted on Dec 20, 2022 10:25PM
ఢల్లీ లిక్కర్ స్కామ్ చార్జిషీట్ లో ఈడీ కవిత పేరు ప్రస్తావించింది. దీంతోఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోందని చెప్పవచ్చు. ఈ కుంభకోణంలో ఈడీ, సీబీఐల దూకుడు గమనిస్తే కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోందనే న్యాయనిపుణులు సైతం అంటున్నారు. ఈ కుంభకోణంలో ఇప్పటికే కవితకు సన్నిహితులుగా ఉన్నవారిని విచారించి, కొందరిని అరెస్టు చేసిన సీబీఐ కవితను కూడా ఆమె నివాసంలో సుదీర్ఘంగా విచారించింది. దాదాపు ఏడున్నర గంటల పాటు కవితను విచారించిన సీబీఐ.. ఆ విచారణ ముగిసిన అనంతరం ఆమెకు మరో నోటీసు జారీ చేసింది.
తొలి నోటీసు సీఆర్పీసీ 160కింద ఇచ్చిన సీబీఐ.. ఆ నోటీసు మేరకు విచారణ పూర్తయిన తరువాత ఇచ్చిన నోటీసు సీఆర్పీసీ 91 కింద ఇచ్చింది. అంటే తొలి నోటీసులో ఆమె వివరణ తీసుకుందుకు మాత్రమే నంటూ ఆమె ఎక్కడ కావాలంటే అక్కడ విచారణ జరుపుతామని పేర్కొన్న సీబీఐ.. ఆమె ఎంపిక చేసుకున్న విధంగా ఆమె నివాసంలోనే విచారించింది. అయితే రెండవ సారి జారీ చేసిన నోటీసులో మాత్రం ఆమెకు అటువంటి వెసులు బాటు ఇవ్వలేదు. ఈ సారి సీబీఐ తాను ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఆమె విచారణ నిమిత్తం వెళ్లాల్సి ఉంటుంది.
తొలి నోటీసు మేరకు ఆమె నివాసానికి వెళ్లి దాదాపు ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన సీబీఐ అధికారులు..మలి నోటీసుకు సంబంధించి మాత్రం సమయం, తేదీ, ప్రాంతం తరువాత తెలియజేస్తామని పేర్కొన్నారు. ఈ నోటీసులు విచారణకు వచ్చేముందు ధ్వంసం చేసి ఫోన్లు, లిక్కర్ స్కాంకు సంబంధించిన డాక్యుమెంట్లు అన్నిటినీ తమకు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇవన్నీ కూడా సాక్ష్యాలుగా పరిగణిస్తారు. మలి నోటీసు మేరకు కవితను విచారించిన అనంతరం ఆమెను లిక్కర్ స్కాం కేసులో నిందితురాలిగా చేర్చే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఇక ఫోన్ల ధ్వంసం సంబంధించిన కచ్చితమైన నిర్దారణకు వచ్చిన తరువాతనే సీబీఐ అధికారులు ఆమెను సీఆర్పీసీ 91 కింద నోటీసు జారీ చేశారని భావిస్తున్నారు.
సీబీఐ కోరిన మేరకు కవిత ఆ వివరాలన్నీ అందించితే ఒక ఇబ్బంది, అందించకుంటే మరో ఇబ్బంది అన్నట్లుగా ఆమె ఇరుక్కున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్త మౌతోంది. అయితే మలి నోటీసు మేరకు ఆమెను ఎప్పుడు విచారిస్తారన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు. ఎందుకంటే త్వరలోనే విచారణకు ఎక్కడకు హాజరు కావాలి, ఏ తేదీన హాజరుకావాలి, ఏ సమయంలో హాజరు కావాలని అన్న వివరాలను త్వరలోనే తెలియజేస్తామని సీబీఐ అధికారులు ఆ నోటీసులో పేర్కొన్నారు.
ఈ కేసులో ఇప్పటి వరకూ సీబీఐ విచారణ తీరును గమనిస్తున్న వారు కవితను సీబీఐ హస్తినకు పిలిపించుకుని విచారణ జరిపే అవకాశాలే మెండుగా ఉన్నాయంటున్నారు.
ఇక తాజాగా ఈ కుంభకోణంలో సమీర్ మహేంద్రు కేసులో ఈడీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈడీ ఆ చార్జ్‌షీట్‌లో ఎమ్మెల్సీ కవిత పేరు పేర్కొంది. కవిత తన 10 సెల్‌ఫోన్లను ధ్వంసం చేసుకున్నట్లు ఈడీ నిర్ధారించింది. కవితతో పాటు చార్జిషీట్ లో మాగుంట శ్రీనివాస్‌రెడ్డి, మాగుంట రాఘవరెడ్డి, ముత్తా గౌతమ్, అరుణ్ రామచంద్రన్ పిళ్లై, అభిషేక్ రావు పేర్లను కూడా చేర్చింది. కాగా ఈ చార్జిషీట్ లో ఒబేరాయ్ హోటల్‌లో సమావేశం జరిగినట్లు ఈడీ వెల్లడించింది. ఒబేరాయ్ హోటల్‌లో జరిగిన మీటింగ్‌లో కవిత, అరుణ్ పిళ్లై, దినేష్ అరోరా, విజయ్‌నాయర్ పాల్గొన్నట్లు పేర్కొంది.