కర్ణాటకలో ఉద్రిక్తత.. తెలుగు విద్యార్ధులపై దాడి..

 

కర్ణాటకలో మరోసారి జాత్యహంకారం బయటపడింది. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఉద్యోగ పరీక్షలు రాసే నిమిత్తం వెళ్లిన తెలుగువారిపై కన్నడిగులు దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీలో బ్యాంకింగ్‌ పరీక్షలు రాసేందుకు వెళ్లిన తెలుగు విద్యార్థులను అక్కడి కన్నడ సంఘాల నేతలు అడ్డుకున్నారు. పరీక్షా హాల్‌ వద్ద అడ్డుకొని హాల్‌ టికెట్లు చించివేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి కన్నడ సంఘాల నేతలను అడ్డుకున్నారు.

 

దీనిపై మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలవారిపై దాడులకు తెగబడం దేశ సమగ్రతను దెబ్బ తీస్తుందని.. జాతీయ స్థాయి పరీక్షలకు వెళ్లే అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైనే ఉందని తెలిపారు. అంతేకాదు తన నియోజకవర్గంమైన రాయదుర్గంలో సగం మంది కన్నడ భాషను మాట్లాడతారని అన్నారు. కన్నడవారిని ఏపీలో అడ్డుకుంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.