కాబూల్‌పై ఉగ్రపంజా

ఆఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌పై మరోసారి ఉగ్రవాదులు పంజా విసిరారు. నగరంలోని అత్యంత విలాసవంతమైన ఇంటర్ కాంటినెంటల్ హోటల్‌లోకి ప్రవేశించిన నలుగురు సాయుధులైన ముష్కరులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడి బీభత్సం సృష్టించారు. అతిథులే లక్ష్యంగా ఎనిమిది గంటలకు పైగా ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. హెలికాఫ్టర్ల ద్వారా హోటల్ పైకప్పుకు చేరుకుని ఉగ్రవాదులతో పోరాడుతున్నారు. ఇప్పటి వరకు ఇద్దరు ముష్కరులు హతమైనట్లు ఆఫ్గానిస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇవాళ జరగనున్న సమాచార సాంకేతిక సదస్సు కోసం కొందరు విదేశీయులు ఈ హోటల్‌లో బస చేసేందుకు వచ్చారు. వీరిని టార్గెట్ చేస ముష్కరులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని అంటున్నారు. ఇదే హోటల్‌పై 2011లో తాలిబన్లు దాడి చేసి పలువురిని పొట్టనబెట్టుకున్నారు. తిరిగి మరోసారి దాడికి పాల్పడటం గమనార్హం.