భావితరాలకోసం బలమైన పునాది-కేసీఆర్
posted on Jun 2, 2016 1:40PM
.jpg)
కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి బలమైన పునాది వేస్తేనే భావితరాలు బాగుంటాయన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ముఖ్యఅతిధిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసు బలగాల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడిన సీఎం..నిధులు, నీళ్లు, నియామకాల కోసమే ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని..ప్రత్యేక రాష్ట్రం వల్లే మన నిధులు మరో ప్రాంతానికి తరలింపు కాలేదని గుర్తు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా రెండేళ్ల పాలన సాగిందని ఆయన అన్నారు. పేదింటి యువతుల కోసం కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. త్వరలో బీసీలకూ కళ్యాణ లక్ష్మీ పథకం అమలు చేయనున్నట్లు చెప్పారు. కళాశాలల్లోనూ సన్నబియ్యం పథకం అమలు చేస్తామని తెలిపారు. 598 మంది అమరవీరుల కుటుంబీకులకు నియామక పత్రాలు అందజేశామని పేర్కొన్నారు.